పుట:Konangi by Adavi Bapiraju.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందుకనే ఇంగ్లీషువారు బర్మారోడు కట్టివేయడం మా మంచిపని! అని వాదించాడు. కోనంగీ, అతడూ మదరాసులో అనంతలక్ష్మి ఇంట్లో కూర్చొని ఈ వాదనంతా చేస్తూ ఉంటే అనంతలక్ష్మి మధుసూదనుని భార్య సరోజనీ వింటూ కూర్చున్నారు. జయలక్ష్మి రవికలకు పూవులు కుట్టుతూ కూర్చుంది.

అనంత: మీరు ఎంత వాదించండి, నాకు ఈ యుద్ధం ఏమీ అర్ధం కావడంలేదు.

సరోజిని: అనంతలక్ష్మి వదినా, ఈ మగవాళ్ళు శాంతిదూతలులా కనబడినప్పుడు వాళ్ళని నమ్మకు. వాళ్ళందరికీ రక్తపాతం అంటే ఇష్టమే!

కోనంగి: గాంధీ మహాత్మునకూనా సరోజినీదేవీ?

సరోజిని: ఆయన మాట తీసుకరాకండీ అన్నగారూ! ఆయన పురుషాతీతుడు.

కోనంగి: స్త్రీలకు రక్తపాతం ఇష్టంలేకపోతే మాంసాహారం ఎల్లా గుటకాయస్వాహా చేస్తున్నారు?

అనంతలక్ష్మి: ఏమి ప్రశ్న వేశారండి గురువుగారూ! మాలో ఉన్న అహింస మీవల్లనే పాడయిపోతో ఉంటుంది.

కోనంగి: ఏమి నంగనాచులండీ! ద్రౌపదికాదూ కృష్ణునితో రాయబారానికి వెళ్ళవద్దని రాజసూయావబృథ స్నానపవిత్రమై దుశ్శాసనునివల్ల అపవిత్రమైన వేణిని చూపింది?

సరోజిని: అన్నగారూ, సీతాదేవి హనుమంతుడు తన్ను తీసుకొని వెల్తానన్నా వద్దు రాముడేవచ్చి రావణుని సంహరించి తన్ను తీసుకువెళ్ళాలంది. అంతమాత్రాన సీత హింసావాదినా?

మధు: మగవాళ్ళకన్నా స్త్రీలు నయమని ఒప్పుకోవాలి. కాని రష్యాలో స్త్రీలుకూడా యుద్ధంలో పాల్గొంటున్నారు.

అనంత: తప్పనిసరి వచ్చిందా మా ఆడవాళ్ళు దద్దమ్మల్లా ఊరుకుంటారా అన్నగారూ, సత్యభామ నరకాసురుణ్ణి చావతన్నింది.

కోనంగి: రుద్రమదేవి మహాదేవరాజు డొక్కచీల్చింది.

అనంతలక్ష్మి: గురువుగారూ! మీరు వాదాని కెంతయినా గమ్మత్తుగా మాట్లాడు తారండీ! మొన్నేగా మీరు మమ్ము శాంతిదూతలని పొగడుతూ పాట వ్రాశారు? అది పాడి వినిపించరూ?

మధు: మంచిమాటన్నావమ్మా అనంతలక్ష్మి!

సరోజిని: ఆ పాట పాడండి!

జయ: కోనంగిరావుగారూ, పాడండి!

కోనంగి: మీ పాటముందూ, మీ అమ్మాయి పాటముందూ నా పాటేమిటి?

అనంత: అయితే ఎందుకు పాడారు నా ఎదుట?

కోనంగి: నువ్వూ నేనూ ఒకటే గనుక.

అనంత: అయితే, ఓ నేనూగారూ! ఓ పాట పాడండి.

కోనంగి: అయితే, ఓ నేనూప్రియా! పాటుతున్నా విను!

రూపజిత స్వర్ణదీ

దీప్తిజిత జ్యోత్స్నాళి

ఆపలే రెవరు నీ

ఆనందజృంభణము!