పుట:Konangi by Adavi Bapiraju.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూడడంతోటే చెట్టిగారు మండిపోయారు. కళ్ళు కాలిన ఇటుకరాళ్ళలా ఎరుపెక్కినాయి. ముక్కుపుటాలు విస్తరించాయి.

“తిరట్టు పయ్యగాడు. ఏమంటాడు, ఏమంటాడు?” అంటూ ఆ పత్రిక తీశాడు.

ఆ పత్రిక చూడకూడదు, చదవకూడదు. అని కోటివేలసారులు అనుకున్నాడు. అయినా 'కల్లు దుకాణానికి వెళ్ళకూడదు అనుకుంటూనే రోజు నాగా లేకుండా తల వంచుకుపోయే పందిలా, చెట్టిగారు ఆ పత్రిక పై అంటించిన విలాస కాగితం చింపి “నిజం' అనే ఆ వారపత్రిక మడత విప్పి, చదువుకోవడం సాగించాడు. లోపల కుడివైపు పేజీ ఒక దాంట్లో, “చెట్టి నవాబుగారి మన్మధ విజృంభణ” అన్న పెద్ద ఆక్షరాల వ్యాసం కనబడింది. చెట్టిగుండె దడదడ కొట్టుకుంది.

మా చెట్టిగారి జనాభా నాటికి వృద్ధి అవుతోంది. మా చెట్టిగారు కోటి మన్మథులను కలేసి నూర్చి పాకంకట్టి, వంటవండిన ముద్ద. వీలయితే చెట్టిగారు లోకంలో ఉన్న ప్రతి అందమైన బాలికా తన శృంగారమందిరంలో తనకోసం నిరీక్షణలో ఉంచుకుంటాడు. అందరూ ఇంగ్లీషు సినిమాలలో నాట్యంచేసే సుందరీమండలిలా, తన ఎదుట నాట్యం చేస్తారు. ఉలిపరబట్టలు కట్టుకుంటారు. ఆ బట్టలు లేకపోతే మరీ అందంగా ఉంటాడు వాళ్ళ మధ్య తాను!" ఒక సినిమాతార కురంగినయన తన ఎదుట!

ఎందుకు కురంగినయన అని మీరు మమ్ము అడగవచ్చును. చెట్టియారుగారి మలయాకోట్లు ఎవరిని సువర్ణలక్ష్మిని చేస్తున్నాయి? కురంగినయన ఎక్కితిరిగే స్టుడిబేకరు కారును, కురంగినయన ఎవరి చెక్కుబుక్కులలో చెక్కుపెట్టి కొనుక్కుంది?

“కురంగినయనా, మన చెట్టిగారూ తిరుచునాపల్లిలో ఆయన మేడలో ఇద్దరే... తారీఖున మూడురోజులు గడిపారే, వారు చేసుకున్న ఉత్సవమేమిటి?”

చెట్టియారుగారి హంసడిభకులు, చెట్టియారుగారు శ్రీరంగంలో ఒక్క ఇంటిలోకి దూరబోతూ ఉంటే అడ్డంబెట్టిన ఒక భర్తను యెందుకు తన్నారు?”

“... తారీఖున సాయంకాలం ఎనిమిది గంటలకు చెట్టియారుగారి ఇంటిలో మదరాసుల ఆరుగురు సీనీమాతారలతో చెట్టిగారు రాసక్రీడ సలిపారేం! ఆ తారలు కురంగినయన, కుమారి మీనాక్షి, కృష్ణబాల, "తరలాక్షి, కావేరీఅంబాళ్, కనకదేవి అనే వారేనా? ఈ రాసక్రీడ ఉద్దేశమేమిటి? ఒక విలేఖరి?”

చెట్టియారు కోపం మిన్నుముట్టి స్వర్గం, సత్యలోకం దాటిపోయింది. ఆయన క్రోధం అతల, వితల, సుతల, మహాతల, తలాతల, రసాతల, భీతల, భాతల, పాతాళాది. లోకాలకు దిగి కమ్ముకు పోయింది. అతని పళ్ళుకొరుకు ధ్వనులు యూరపు అమెరికాలు, అఫ్రికా ఆస్ట్రేలియాలు, ఆసియా ఖండాలు నిండిపోయాయి.

వెంటనే నూరు విమానాలకు వేయిటన్నుల బాంబులు, తిరుచునాపల్లిలో ఉన్న ఆ ముద్రణాలయంమీద విసరివేయండని మనస్సులో ఆజ్ఞలను జారీచేయించినాడు.

“ఒరే సభాపతీ!” అని కేక వేశాడు. తన అరువల్తో ఆరుమంది నన్నా బలిగొన్న సభాపతి పిళ్ళ లోపలికి వచ్చి చెట్టియారునకు దణ్ణం పెట్టాడు.

“ఈ 'నిజం' పత్రికగాడు?”

“చిత్తం మీరు. ఎప్పుడు 'ఆమ' అంటే ఆ మర్నాడు 'నిజమా? ఉండదు. దాన్ని రాసే ఆ పైత్తకారీ ఉండడు.”

“మంచి వీలు చూడండి. వాడిని..."