పుట:Konangi by Adavi Bapiraju.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

ఇంత అద్భుతమైన ఉత్తరాలు తాను వ్రాస్తూ, తన భర్త తనకు వ్రాస్తూ ఉన్న సమయంలో, ఒకరోజున చిరునామా టైపు కొట్టిన ఉత్తరం ఒకటి వచ్చింది. తన స్నేహితురాం డ్రైవ్వరైనా వ్రాసి ఉంటారనుకొని, అనంతలక్ష్మి ఉత్తరం విప్పింది. లోపల కూడా టైపుతోనే ఉన్నది! ఆ ఉత్తరం చదువుతూ ఉండగా అనంతలక్ష్మికి కోపం ప్రారంభించి అంతకన్న అంతకన్న కోపం పెరిగిపోయింది.

ఆమె చేతులు వణికాయి. కన్నులు కెంపెక్కినాయి. ఆమె క్రింది పెదవి ఆమె పళ్ళతో నొక్కిపట్టగా గాట్లుపడి రక్తం కారింది.

ఒక్కసారిగా ఆమె కళ్ళవెంట నీరు కారిపోయాయి. ఆమెకు గుండె బరువెక్కి పోయింది. చేతిలో ఆ ఉత్తరం ఉండగానే మంచంమీద వాలి పోయింది.

ఒక అరగంటకు తన్నుతానే సమాళించుకొని, లేచి మంచంమీదే కూర్చుండి, ఆ ఉత్తరం మళ్ళా చదవడం ప్రారంభించింది.

ఆ ఉత్తరం తమిళభాషలో ఉంది.

మద్రాసు - మైలపూరు,

సింగపుర భవనం,

18-4-41.

ప్రియమైన అనంతలక్ష్మీ!

కొన్ని అనివార్యమయిన కారణాలచేత మీ మీద వ్యాజ్యం వేయవలసి వచ్చింది.

నన్ను నువ్వు పూర్తిగా ఎరుగుదువు. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసును. నా ప్రేమ ఒక మహాసముద్రం, నాకున్న ఏభయి అరవై లక్షల ఆస్తి నాకు నీ ప్రేమ ముందు గడ్డిపరకతో సమానం.

ఈ ప్రేమతో నాలో తుపానులు చెలరేగి ఉన్నప్పుడు. నువ్వు నన్ను కాదనడంవల్ల నేను నా ప్రేమావేశంచేతనే అమితమైన కోపం వచ్చి అలా వ్యాజ్యాలు వేశాను.

ఇప్పుడైనా ఏమీ పరవాలేదు. నన్ను బాగా తలుచుకో! నేను ఏలాంటి శక్తిగలవాణో. నేను గవర్నరు జనరలుతో సమానంగా మాట్లాడగలను. నేను కలెక్టరు ఉద్యోగాలు ఇప్పించగలను. నా పాదాలమీద వ్రాలి అనేకులు ప్రభుత్వ ఉద్యోగులు బ్రతుకుతున్నారు.

నువ్వు నా దానవై ఉంటే, నిన్ను దివ్యమయిన విమానంమీద అధివసింపచేసి లోకాలు తిప్పగలను. నీకోసం మహారాజులు ఎరుగని రాజభవనాలు కట్టి ఇవ్వగలను. రోజూ నిన్ను పన్నీట స్నానం చేయిస్తూ ఉండగలను. నీ కొరకై వేలకొలది ఎకరాల తోటలు వేయించి ఇవ్వగలను. నీ అంతబంగారు విగ్రహాన్ని చేయించి నీకు బహుమతి ఇవ్వగలను.

నీ పూర్వీకులైన వారు సరియైన వాళ్ళను ప్రేమించారు. మధురవాణి రఘునాథ నాయకునకు రాణి అయింది. నీ తల్లి లక్షాధికారిని చేబట్టింది.

నీకూ నాకూ మధ్య ఎవరూ రావడానికి వీలులేదు. నీ మీద ఉండే ప్రేమవల్లనే. నీకు ఇష్ణుడు అని నీవనుకున్న మనుష్యుడు ఏవో మంచినీళ్ళు తాగుతున్నాడు. నా ప్రేమ ఆవేశంలో నన్ను నేను మరిచిపోయి ఉంటే, వాడికి కన్నూ, కాలూ, ముక్కూ చెవులూ పోయివుండును.