పుట:Konangi by Adavi Bapiraju.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీకు జరిగిన పెళ్ళి వేళాకోళం పెళ్ళి. ప్రేమ ఉన్నచోట పెళ్ళి ఏమిటి? ప్రేమలేని పిచ్చివాళ్ళకు పెళ్ళి. అందుకనే నేను పెళ్ళిచేసుకున్న మా కులం అమ్మాయి మొగం ఇంతవరకూ చూడలేదు. నీ మీద నా ప్రేమ అలాంటిది.

ఇప్పుడయినా మునిగిపోలేదు. ఒక్కసారి వచ్చి నా యింట్లో, నా దివ్యమందిరంలో ఒక రాత్రి గడుపు. ఆ పిచ్చి కోనంగి మర్నాడు నీ ఇంటికి వస్తాడు. మనం కలుసుకుంటూ నిజమయిన తనివితీరని మధుర రాత్రులు కలిసి గడుపుకుంటూ ఉండవచ్చును. వాడికి నీ చిత్తం వచ్చిన ఉద్యోగం ఇప్పిస్తాను.

వాడు చెడిపోయిన వెధవ దానికి ఓ వెధవయ్యకు పుట్టినవాడు. వాడికి నీతీ నియమమూ ఎలా వుంటుందనుకున్నావు. ఆ పిశాచిగాడు సినీమాతారల ద్రాక్షసారాయి మత్తు పెదవుల్ని ఎన్ని త్రావి త్రేవులు త్రేన్చాడో! ఎంత మందికి వాడు రాత్రిళ్ళప్పుడు దాసుడయ్యాడో నాకు తెలుసును; నీకేం తెలుసును?

వాడి స్నేహితుడు డాక్టరు ఇంకా చిత్రమయినవాడు. వాడికి పెళ్ళి పెటాకులు ఎందుకు లేవనుకున్నావు? వీడూ వాడూ కలసి ఆ సినీమాతారలతో ఎంతో గాఢసంబంధం పెట్టుకొని ఉండేవారట. జయిలుకు వెళ్ళవలసి వచ్చింది. కాని, అంతవరకూ ఆ తారలను వీళ్ళిద్దరూ వదలలేదట. లేకపోతే వాళ్ళ కంత స్నేహం ఎందుకనుకున్నావు? అలాంటి ఒక చచ్చుగాడా నీకు భర్త?

కాబట్టి నా దర్జా నీ అందమూ, నా ధనమూ నీ విలాసమూ కావేరీవేగయిలుగా కలిసినట్లు అవ్వాలి. ఊఁ అను. ఒక్క కార్డు నీ దస్కత్తుతో పంపించు. నీ అందంకోలే తుమ్మెదనై నీ దగ్గర వాలుతాను.

ఇట్లు నిజంగా

నీ ప్రియమైన భర్త

చెట్టి.

ఆ సమయంలోనే కడలూరు జయిలులో ఉన్న కోనంగిరావుగారికి, ఒక ఉత్తరం వచ్చింది.

మద్రాసు,

16-4-1941.

సింగపూరు భవనం,

మైలాపూరు.

ప్రియమైన కోనంగిరావుగారూ,

మీరు చాలా మంచివారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీ సాధుత్వమూ, మీ మంచీ అందరూ ఎంతోగా చెప్పుకుంటారు.

కాని నేను జయలక్ష్మిమీద ఎందుకు వ్యాజ్యం వేశానో చెప్పవద్దూ మరి. జయలక్ష్మి, దాని కూతురు అనంతలక్ష్మీ నా ఉంపుడుకత్తెలు. అనంతానికి నేను దాని పద్నాలుగో ఏటనే కన్నెరికం చేశాను.

జయలక్ష్మి వట్టి గడ్డురండ. నా డబ్బు యెంత తిందో! అనంతం అయ్యంగారిపిల్ల కాదు. అయ్యంగారు మాత్రం సామాన్యుడా? వాడికా డబ్బంతా ఎల్లా వచ్చింది ఈ జయలక్ష్మిని కోటీశ్వరులకు సప్లయిచేసి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు.

వాడు ఆడందేది. చివరకు వాడికి జబ్బు చేసింది. ఆ జబ్బులో వాణ్ణి తిన్నగా జయలక్ష్మి చూడకపోవడంవల్ల వాడు చచ్చి ఊరుకున్నాడు.