పుట:Konangi by Adavi Bapiraju.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్దం అయితే, ఏదో కప్ప వచ్చిందని నన్ను తరిమివేయరుకదా! మీ యింటి ప్రక్కనున్న కొక్కిరాయిగాళ్ళు.

సౌందర్యనిధీ! అంతమంది ప్రాచ్యులూ, అప్రాచ్యులూ, వారి వారి దేశాలలో వారి వారి భాషల్లో వర్ణించుకొన్న వారి సౌందర్యాంగనలు. ఏ విధంగా ఆలోచించినా వట్టి చింపిరి నాగమ్మలులా ఉంటారేమిటి? కాకీపిల్ల కాకికి ముద్దు అన్న సామెతలా ఆడకాకి మగకాకికి హంసలా కనబడుతుంది.

పరీక్షలో ఎలాగో నెగ్గానన్నావు. ఏమిటి మరి. గౌరవం దక్కడానికి నేను గురువునయ్యాను. కాని నీ గురువు నవడంవల్ల కొలత వేయలేని లాభం నాదే!

నేను నీ కోసం విరహతాపం పడటంలేదు అని వ్రాస్తే అబద్దం! నిజం వ్రాస్తే నువ్వు బాధపడతావు. ఏమీ వ్రాయకుండా ఊరుకుంటే, “మౌనం అర్ధాంగీకారం' అన్న ఇంగ్లీషు సామెత అమలులోనికి వస్తుంది.

నువ్వు వ్రాసిన ఉత్తరం ఎంతకూ తరగని అమృతసముద్రం నేను కుంభసంభవుణ్ణి. ఒక్క వుడిసిలి పడతామంటే, నాకు విశ్వమంత అంజలి లేదాయను.

నేను లోకంలో ఎందుకు పనికివస్తాను హృదయేశ్వరీ! రాజకీయ నాయకుణ్ణి కాలేను. వినాయకుణ్ణి కాలేను. అనుసరించే సామాన్యుణ్ణి కాలేను. స్వయంగా యే కొత్త మార్గమూ సృష్టించుకోలేను.

నువ్వు పంపిన పుస్తకాలన్నీ చదువుతున్నాను. ప్రస్తుతం వేదాంత పుస్తకా లేవీ పంపకు.

రాజకీయాల విషయంలో ఏమి చేయాలో నాకేమీ తోచడంలేదు. నేను రాజకీయవాదిని కాను. జయిలు నుంచి రాగానే ఏదయినా పరిశ్రమలో చేరుదామని ఉంది. నీ సలహా ఏమిటి?

నువ్వు ఎప్పుడు వస్తావు చూడడానికి? నన్ను చూచి బెంబేలుపడకు. ధైర్యంగా ఉండు. నువ్వు, వెన్నెల వర్షిస్తున్నట్టు మందహాసవదనవై రా! పాలసముద్రము ఉప్పొంగినట్లు ధైర్యంగా రా! రాజకీయ ఖైదీలుగా కోర్టుకు వెళ్ళినా వాళ్ళని పట్టుకు వదిలేస్తారు పోలీసువారు.

కోరకుండా అదృష్టంవల్ల వచ్చిన జయిలు, నన్ను కూడా ఒక నాయకుణ్ణి చేశారు. ప్రభుత్వంవారు. అయిదారు ఉపన్యాసాలు ఇస్తేనేగాని రాని నాయకత్వం, క్రిందటి ఏ జన్మలోనో పుణ్యంచేసి ఉండడంవల్ల దాని అంతట ఆదే వచ్చి మెళ్ళో దండలు వేసి వరించింది.

నా జీవితేశ్వరీ! ఉత్తరం పంపించేవేళ ఔతోంది. ఎంత వ్రాస్తే నీ దగ్గర ఉన్నట్లవుతుంది? నీ పెదవులు హృదయమార గ్రోలినట్లవుతుంది?

గాఢ ప్రేమోత్కంఠుడు

నీ ప్రాణపతి

కోనంగి.

ఉత్తరం చదువుతూ కన్నీళ్ళతో కరగిపోయింది, ప్రేమతో ఉప్పొంగి పోయింది. కలకల నవ్వుకుంది. ఆ ఉత్తరం కళ్ళకద్దుకొంది. చదువుకొంది. చదవకుండా చూస్తూ కూచుంది! హృదయంలో దాచుకుంది అనంతలక్ష్మి.