పుట:Konangi by Adavi Bapiraju.pdf/180

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నా వర్ణన నాకే లోటుగా ఉంది. ఆ అస్పష్టకాంతిలో చూచాను మొదట మిమ్మల్ని దానితోనే నా మతిపోయింది. నేనూ మా బాలికలతో పాటు ప్రేమ అనేది ఉండదు అనే అనుకొనేదాన్ని.

కాని ప్రేమ ఇంత అద్భుతము, వర్ణనాతీతము అని అనుకోలేదు. ఎంత విచిత్రమైనవారు మీరు! మొదటి రోజులలో మీరు కనబడినంత సేపూ గుండే పంజాబు మెయిలే! మీరు పొరపాటున నన్ను ముట్టుకుంటే ఏదో వివశత్వం కలిగేది. నా రహస్య హృదయంలో మీరు నా దేహాన్ని ఏక్షణమైనా కోరితే అది వెంటనే సమర్పించాలి అన్న గాఢతి గాఢవాంఛ ఒక ప్రక్క ఇంకో ప్రక్క మిమ్ము నేను ఎంత ప్రేమించినా, మీరు వివాహం అయిన వరకూ ఒక విధంగా పరపురుషులే అన్న భావమూ నన్ను గగ్గోలు చేశాయి.

మీరు నన్నన్నిసారులు కౌగలించుకొన్నారు. ఆ నిమిషాలలో మీరు కావాలంటే నా సర్వస్వము మీది! అయినా మీరు నన్నంత గాఢంగా అదుము కొని, నా పెదవులు మీ పెదవులు లయింపచేసుకొని, గాఢతా, లాలిత్యమూ రెండూ వ్యక్తం చేశారు నా ఆత్మేశా!

ఎన్ని జన్మముల నుండి తపస్సు చేశానో మిమ్ము నా సర్వస్వనాథునిగా వరం పొందడానికి? మీరే నాకు కోటి జన్మముల నుంచీ భర్తలై యుండాలి. లేకపోతే ఆ అస్పష్ట కాంతులతో దర్శనమిచ్చిన ప్రప్రథమ క్షణంలోనే మీరే, మీరే నానాథులని నాకు ఎందుకు తోచాలి?

మీలో లయమైపోవడానికి దేహమడ్డం అనిపిస్తుంది. ఆ దేహంలేక మీతో నా పూర్ణమౌవనానంతమత్తత అనుభవించడం ఏలాగు అని అనిపిస్తుంది.

"మీరు నా కేశసౌభాగ్యం కోటి కాదంబినీమాల అన్నారు. కోటి కోటి శ్రీకృష్ణపరమాత్మ దేహకాంతులన్నారు. నన్ను తలంటుకోమని, ఎన్నిసారులు నా కచభారము మీ మోమునంతా కప్పుకోలేదు? మీరు వట్టి కొంటెవారు. లేకపోతే అన్నిసారులు నా కురులన్నీ చిక్కులు చేసి అల్లరిచేస్తారా, చెప్పండి? నేను మీ తల ముద్దెట్టుకొంటే, మీది వట్టి కాఫింగు తల అయినా మీ బుద్దిలో ఉన్న పరిమళపు ఆలోచనలు ఆ తలలోంచి పయికి వస్తూ ఉంటాయి కాబోలు, దివ్యమయిన మీ తలను ఆఘ్రాణించి, ముద్దు పెట్టుకొంటోంటే మత్తు వచ్చినంత పని అయింది.

పూవులు పూవులన్నారు మీరు. స్త్రీలకూ పూవులకూ మీరన్నట్లు ఏదో అననుభూతమయిన సంబంధం ఉన్నది. మా తండ్రిగారి కుటుంబంలోనూ, మా తల్లిగారి కుటుంబంలోనూ కూడా కుసుమ రచనా లలితకళ ప్రపంచ శిఖరితమైనది గురుదేవా! మీరు కోరినప్పుడల్లా ఒక్కొక్క రచనరచించి నా జడను; నా జడముడిని అలంకరించు కొన్నాను. జడను వేయడమూ, జడముడులు రచించడమూ మా కుటుంబంలో ఉంది.

గులాబీలు, మల్లెలు, మల్లెలు, జాజులు, చేమంతులు, కదంబాలు, కనంకాబరాలు, గొబ్బిపూలు, కేతకీకుసుమాలు, పొగడలు, నీలిహృదయాలు, ఘంటికా పుష్పాలు, కరవీరాలు, మందారాలు, సువర్ణకరవీరాలు, మరువక దమనక, కురువేరులు, నూతనంగా వచ్చే ఆర్చిడ్లు, దాలియాలు, జీనియాలు, నీబాపూలు, కాశీరత్నాలు, మదనభాణాలు అన్నీ నేనే అల్లాలి జడలలో. ముడులలో, అర్ధజడలలో, అర్ధశిఖలో నేనే పూవులు కూర్చాలి.

జీవితేశ్వరా! మీ కోసం నేను, నా అందం మీకోసం, నా చదువు మీకోసం, నా సంగీతం మీ కోసం!