పుట:Konangi by Adavi Bapiraju.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధర్వనికేతనం,

మేలాపురం,

12-4-41.

ప్రాణకాంతా!

జయిలులో ఉన్నా మీరు ఉత్తరం వ్రాయగలుగుతున్నారు అన్న సంతోషం ఒక ప్రక్కా నీలాకాశంలో పిడుగు పడినట్టు మీకూ నాకూ ఆ పవిత్ర ముహూర్తంలోనే ఎడబాటు కలిగిందన్న భరింపరాని బాధలు ఒక ప్రక్కా నన్ను ఊపివేస్తున్నాయి.

మిమ్ము విడిచి యుగాలయినాయన్న నిస్పృహ వేధిస్తున్నది. ఏనాడో మిమ్ము తిరిగి చూడడం!

ఏం చేస్తున్నారు? అంత నిర్దయగా వెళ్ళిపోయారు. ఏం చేద్దామని?

నేను చదవలేను, పుస్తకం ముట్టలేను. ఈ ఏటి పరీక్ష ఏమవుతుందో?

ఇంట్లో కూచోలేను. ఇంటిబయటకు వెళ్ళలేను. ఎడారి ఎల్లా ఉంటుందో నేనెప్పుడూ చూడలేదు. కాని ఎడారినిగూర్చి చదివినవన్నీ నిజమే అయితే, నా మనస్సు ఏమీ ఓయాసిస్సులేని 125 డిగ్రీలు వేడిగల, పది సహారా ఎడారులు కలిసినట్లయి పోయింది.

నా హృదయప్రభూ! మీరు నా జీవితంలోకి రాకపోయివుంటే, నాజన్మ బూడిదలా రాలిపోయి వుండును. మీరు వచ్చారు. నా జన్మకోటి కాశ్మీర విశాలమయింది. అలాంటిది మీరల్లా నన్ను వదలి వెళ్ళిపోయారు. ఎంత నిర్గయో మీది?

వెనక శ్రీకృష్ణుడు రాధను వదలి మధురకు వెళ్ళినప్పుడు ఆమె పడినబాధ, నా బాధ ముందు సంతోషం వంటిది, ఆత్మానాథా!

మీ నిర్బంధానికి కారణం మన దుష్టగ్రహము చెట్టగాడే! నన్ను వాంఛించి, విఫలుడై ఆ రాక్షసుడు అలా చేశాడు. వెనక సీతాదేవిని రావణుడు ఎత్తుకపోయినాడు. ఈ పిశాచి రాముణ్ణి ఎత్తుకుపోయాడు. నేనే బయలుదేరి కడలూరుకు వస్తున్నా. కటకటాలు ముక్కలుచేసి, గోడలు పిండిగొట్టి, మిమ్మల్ని తిరిగి తీసుకువస్తాను. నాకు లక్ష్మణులు " వద్దు, హనుమంతులు వద్దు, వానరబలగం వద్దు.

నేను అందగత్తెనని మీరంటారు. అది నాకు ఏమీ నమ్మకం లేదు. మీకు శిల్పం విషయం ఏమీ తెలియదు. మీ అందం మీరెరుగని అమాయకులు ప్రాణేశ్వరా! మీ మోముతో పోల్చడానికి సృష్టిలో ఏ వస్తువూ దొరకదు నాకు. ఫాలం ఆకాశం అని ఏదో పోల్చుకుంటాను. ఆకాశంలో గంభీరత ఒకనాడు కనబడకపోవచ్చును, కాని మీ ఫాలం అనంతవిశ్వాలు దాటిన మహా భావపూరితమని చెప్పగలను. మీ కనుబొమల సౌందర్యము ఆకాశగంగకు లేదని మాత్రం చెప్పగలనండీ.

మీ కన్నులు నేను వర్ణించలేను. ఆ కన్నులు పెద్దవీకావు, చిన్నవీకావు. అవి తారకలూ కావు, సూర్యచంద్రులూ కావు. అవి కాలమూకావు, కాలాతీతాలూ కావు.

మీ ముక్కు మకరసంక్రమణ ఉదయారుణకిరణము, కోటికోటి కిరణాలు.

మీ పెదవులూ, వానిలోని నవ్వులూ, ఒక్కొక్క అవతారం ఉద్భవించినప్పుడు దేవతలు పొందే దివ్యానందం!

మీ మూర్తిని తయారుచేస్తూ మిగిలిన భావాలతో సృష్టికర్త. జయంతుణ్ణి, నలకూబరుణ్ణి తయారుచేసేవాడని అనుకుంటాను.