పుట:Konangi by Adavi Bapiraju.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓ రోజున మీకు జ్ఞాపకం ఉందీ? నేను ఫిడేలు వాయిస్తూ ఒక మువ్వగోపాల పదం పాడాను:

“ఏంత చక్కనివాడే

నా సామీ-వీ

డెంత చక్కనివాడే!

ఇంతి మువ్వగోపాలుడు

సంతతము నా మదికి

సంతోషము చేసెనే... ఎంత?

మొలక నవ్వుల వాడే

ముద్దు మాటల వాడే... ఎంత?”

అని పాడుతూ వుంటే కళ్ళనీళ్ళతో ఏదో దివ్యకాంతి మీ మోమున ప్రసరింప నా ఒడిలో తల పెట్టి కరగిపోయారు!

నా గురూ! రండి, నేను ఎన్నో పాటలు పాడుతానండీ.

మీ పాదపద్మాల

అనంత.

2

ఏ రోజు కారోజు ఉత్తరం భర్త కడ నుండి రావలసిందే. ఆ వేసవి కాలంలో ఆమెకు ఉత్తరాలే మల్లెపూలు, గులాబీలు, వట్టివేళ్ళ అత్తరులు, చల్లగాలులు, చల్లటి నీళ్ళు, సముద్రం వ్యాహాళులు.

కోనంగిమయ ప్రపంచం ఆమెకు. అతడుపయోగించిన ప్రతివస్తువూ పవిత్రమూ, పూజార్హమూ!

ఒక రోజున వచ్చిన పెద్ద ఉత్తరాన్ని మామూలుగా చదివే పదిసార్లు కాకుండా పది హేనుసార్లు చదువుకుంది. మామూలుగా పెట్టే ముద్దుల కన్న కొన్ని వందలు ఎక్కువ పెట్టింది. ఆ ఉత్తరం తన బాడీజేబులో గుండెకు దగ్గరగా దాచుకుంది.

ఆ ఉత్తరం నరాల ద్వారా ఇంజెక్షను ఎవ్వరై నా ఇవ్వగలరా? లేక తన హృదయం తెరచి లోపల పెట్టి తిరిగి కుట్టెయ్యగలరా?

కడలూరు జైలు,

14-4-41.

ఓ ఆనంద వికసిత విశాలనయనా!

నా అనంతా, నా లక్ష్మీ! నవనీతవచోపూరితకంఠీ, ఎన్నాళ్ళయింది నీ తీయతీయని పాట విని.

అమృతపానంలోన

అర్ధభాగముపాలు

కామధేనువుపాలు

సోమరసములు కలిపి