పుట:Konangi by Adavi Bapiraju.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వినాయగంపిళ్ళ, ఆతడు తీవ్రంగా జట్కావాడు కందప్పను చూచి, “ఏమిరా కందప్పా, ఎంత కండకావరంగా, వారు గాంధీజీ శిష్యులనయినా ఆలోచించలేదే నువ్వు? లెంపకాయకు చేయ్యెత్తినావే” అని మళ్ళీ అడిగాడు. జట్కావాడు ఆ ఖద్దరు వస్త్రధారి యెదుట సాగిలబడినాడు.

ఈ వినాయగం అనినా, ఆతని ఇద్దరు స్నేహితులనినా దుష్టులకు అలాటి భయం!

5

కారాగారంలోకి అడుగిడగానే 'గోరంటు' (క్వారంట్రెను)లో ప్రవేశపెడతారు. జైలు సర్వరోగ నిరాకరణ ప్రదేశమనిన్నీ, ఆరోగ్యదేవతా తాండవ రంగస్థలమనీ ప్రభుత్వంవారు బాగా నమ్మి ఉండడంచేత అలాంటి పరమ శుభ్ర ప్రదేశంలోకి వచ్చేవారు కొన్ని క్షాళనాలు పొందితేనేగాని అడుగు పెట్టడానికి వీలులేదని నిర్ణయించారు. ఆ క్షాళన ప్రదేశం “గోరంటు”

ఏడురోజులు 'గోరంటు'లో ఉండి కోనంగిరావూ, డాక్టరు రెడ్డి జైలు ప్రథమద్వారం (అది రథాలు కూడా వెళ్ళేటంత పెద్దది) దాటారు, కార్లూ, గీర్దూ, రథాలూ వగైరాలకే తెరుస్తారు. మామూలు ఖైదీలు ప్రవేశించేటప్పుడు, పెద్దగేటులో ఒక చిన్న తలుపు ఉంటుంది. అది తెరచి ప్రవేశింపబెట్టారు ఖయిదీని.

ఆ ద్వారభాగం కాల్వ 'లాకు' లా ఉంటుంది. ఇక్కడ ఖయిదీని పూర్తిగా పరీక్ష చేస్తారు. ఏ వస్తువులన్నాదాచి పట్టుకువస్తున్నాడా అని బట్టలు కూడా విప్పి పరీక్షచేస్తారు.

ఆ తర్వాత అతనికి కఠిననరకం అయితే దుస్తులు: 1. పొట్టిలాగు, 2. బనీను, 3. నెత్తిటోపీ ఇస్తారు. అవి ఖయిదీ దుస్తులు. అవి రెండు సెట్టులు ఇస్తారు. అవి పట్టుకొని రెండవ గేటు దాటాలి. ఇక జైలాశ్రమ ప్రవేశం. ఏ-తరగతి ఖయిదీలకు ఖయిదీ దుస్తులు లేవు.

జైలులో ఒంటిగా ఏ ఖయిదీ వెళ్ళకూడదు. కూడా వారు (వార్డర్) గాని, కానీ కార్డు (కాన్విక్టు వార్డరు) గానీ, (ఎడ్వార్డు) హెడ్ వార్డరుగాని కూడా ఉండాలి.

జైలు వంకర టింకరలతో కలిసి ఒక రథచక్రంలా ఉంటుంది. పెద్ద జైళ్ళకు మధ్యను 'టారు' (టవరు) ఉంటుంది. చిన్న జైళ్ళకు ముఖ్యద్వారమే టవరు.

టవరుమీద సూపరెంటు (సూపరింటెండెంటు) ఆఫీసు ఉంటుంది. జైలు వేరు (జైలరు) ఆఫీసూ ఉంటుంది.

జైలులో చేసే పనులన్నీ ఖయిదీలే చెయ్యాలి. నూనె గానుగ ఆడడం, నూలుచేత, గొంగళీ, తివాసీ నేత, వడ్రంగిపని, తోటపని, వడుకు పని, రంగులు వేసే పని, కార్ఖానాపనీ అన్నీ ఖయిదీలే చేయాలి.

వంటా వారే. మంగలి, చాకలి పనులూ వారే, పాకీ పనులూ వారే!

కాంగ్రెసు గాంధీమహాత్ముని ఆధ్వర్యం క్రిందకు వచ్చి, అహింసా వ్రత దీక్షాపరులు వేలకువేలు, లక్షలకు లక్షలు జైళ్ళకు వెళ్ళడం ప్రారంభించిన కొలదీ జైళ్ళలో అనేకమైన మార్పులు వచ్చాయి.

అంతకుముందు మామూలు జైళ్ళకు చుట్టే యినప పట్టాలు పదును పెట్టిన మంగలికత్తులుగా వాడేవారు. ఆ కత్తులు వెంట్రుకలతోపాటు చర్మపు పెళ్ళలు కూడా చెక్కివేస్తుండేవి.