పుట:Konangi by Adavi Bapiraju.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేరు పొందినవారు. సాధుమూర్తి. ఏదో పని వుండి తిరుపతి చూచిన తర్వాత మదరాసు వచ్చాడు. మదరాసులో రామస్వామి మొదల్యారు సత్రంలో మకాంపెట్టి, మూడు రోజులుండి పని చూచుకొని, ఆ వెనుక తిరిగి వెళ్ళిపోదామని ఆ తెలుగు పెద్దమనిషి ఉద్దేశం.

రైలు దిగీ దిగడంతోటే, కూలీలను మాట్లాడుకొని కుటుంబంతో జట్కాబళ్ళ దగ్గరకు వద్దామని నడుస్తూ ఉన్నాడు. టికెట్టు గేటు దాటడం తోటే ఒక జట్కావాడు వచ్చి “రాండి స్వామీ!” అని కూలివాని నెత్తిమీద మూటలు లాక్కొని ముందుకు సాగినాడు.

ఈ పెద్ద “అక్కడ సామాను పెట్టు, నేనే జట్కాల స్టాండు దగ్గరకు వచ్చి బేరం మాటాడుకుంటానయ్యా” అని అన్నాడు. ఆ జట్కామనిషి వినకుండా సామానుతో ముందరకు పోసాగాడు. ఆ పెద్దమనిషికి కొంచెం కోపం వచ్చి, తన చేతిలోని సామాను క్రిందను ఉంచి పరుగెత్తుకొని వెళ్ళి జటామనిషి చేతిలోని మూటలు లాక్కొన్నాడు. దానితో ఆ జట్కావాడు పాములా బుసకొడుతూ “బయటకు రారా పైత్తకారీ నీ పని బడతానని వెళ్ళిపోయాడు.

ఈ పెద్దమనిషి జట్కాల దగ్గరకు కుటుంబంతో వెళ్ళేసరిగి ఆ జట్కావాడు “ఏమిరా వెధవా! నా చేతిలో మూటలు లాగుతావుటా, ఇక్కడ నిన్ను నీ పెళ్ళాం వాళ్ళ ఎదుట పాతివేస్తా'నంటూ మీదకు వచ్చాడు. .

ఆ పెద్దమనిషి తెల్లబోయాడు. నోట మాట రాలేదు. చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు. అంతా జట్కావాళ్ళే! కుటుంబంవారు హొల్లుమన్నారు. జట్కావాడు ఆ పెద్దమనిషిని చెంపపై బలమైన బలమైన దెబ్బకొట్టబోతూ, చటుక్కున ఆపుచేసి వెనక్కు తగ్గాడు.

ఇదేమిటా అని ఆ పెద్దమనిషి ఇటూ అటూ చూస్తే అప్పుడే ఖద్దరుషర్టూ, ఖద్దరు గూడకట్టూ, ఖద్దరు టోపీ పెట్టుకొన్న శలాకలా ఉన్న ఒక మనుష్యుడు వస్తున్నాడు. ఆ పెద్దమనుష్యుని చుట్టూ మూగిన జట్కావాళ్ళంతా చూసి భయంతో వెనక్కు వెళ్ళిపోయారు. ఆ మనుష్యుడు వాళ్ళవైపన్నా చూడకుండా “ఏమండీ స్వామీ, ఏమిటిదా గడబిడ?” అని ప్రశ్నించాడు.

పే. మ: ఆ జట్కావాడు నన్ను కొట్టాలని మీదకు వచ్చాడు.

మను: ఎందుకు?

పె. మ: రైలులో నుంచి వస్తోంటే, మా కూలీ నెత్తిమీదనుంచి నాతో బేరం ఆడకుండానే మూటలులాగి గబగబ ఇక్కడకు వస్తోంటే, నేను భయపడి నా మూటలు నేను లాక్కున్నాను. ఇక్కడకు రాగానే, “నా చేతిలో మూటలు లాక్కుంటావా?” అంటూ ఏదో అరవంలో అంటూ, ఈ జట్కా వాళ్ళందరూ నా చుట్టూ మూగుతుండగా నన్ను లెంపకాయ కొట్టడానికి సిద్ధమైనాడు.”

“అలాగా? ఏమిరా కందప్పన్, ఈలారా” అని జట్కా వాళ్ళ వైపు చూచి వాళ్ళచాటున వున్న ఆ పొగరుబోతు జట్కావాణ్ణి పిలిచాడు. వాడు గడగడలాడుతూ ఆ మనుష్యుని దగ్గరకు వచ్చాడు.

“ఏమిరా కందప్పా? మీ జట్కావాళ్ళు పొగరెక్కిపోతున్నారా ఏమిరా? మాట్లాడవేం? ఆయన కాళ్ళు పట్టు. ఇక్కడ నుంచి జాగ్రత్త. నేను చూడకపోతే ఆయన్ను లెంపకాయ కొట్టేద్దువుదానే? నువ్వు చేసిన ఈ తప్పిదానికి ఏమి శిక్ష విధించాలిరా?”

ఆ పెద్దమనిషి ఈ ఆగంతకుని చూచి “ఏమండీ స్వామీ, మీరేవరో తెలియదు. ఈ తప్పిదానికి ఆయన్ను క్షమించండని మా ప్రార్థన' అని తెలియజేశారు. ఆ ఆగంతుకుడు