Jump to content

పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

కవికోకిల గ్రంథావళి


దర్శకుఁడు. కావున మొట్ట మొదట ఆయన కవిత్వమునుగుఱించి తెలిసికొందము. రామమోహన రాయలు కలకత్తా నగరమున బ్రహ్మసమాజమును స్థాపించిన వెనుక బెంగాలీ సారస్వతమున నూతన జీవసంచలనము ప్రారంభమయి, దినదినాభివృద్ధి గాంచినది. బ్రహ్మసమాజపు ప్రార్ధన మందిరములందుఁ జదువుటకను, మతప్రచారము గావించుటకును క్రైస్తవుల పాటలు (Psalms) వంటి గీతములు రచియింపఁబడినవి. ఈ గీతారచనమే బెంగాలుదేశపు ఆధుని కాధ్యాత్మిక కవిత్వమునకు బీజము. రవీంద్రుఁడు బాల్యమునందే ఇంగ్లీషు కావ్యములను జదివెను. అందు ముఖ్యముగ కీట్సు, షెల్లి , బ్రౌనింగు అను ఇంగ్లీషుకవుల కవిత్వములలోని సారమును దనివి దీఱ నాస్వాదించెను, కాళిదాసుని శాకుంతలము, కుమారసంభవము, మేఘసందేశము రవీంద్రుని హృదయమును ప్రబలముగ నాకర్షించిన వనుటకు ఆయన 'ప్రాచీన సాహిత్యము' అను గ్ర«థమునఁ గావించిన తత్సంబంధము లైన విమర్శనములే సాక్ష్యములుగ నున్నవి.

చైతన్యుఁడు, జయదేవుఁడు మున్నగు వైష్ణవ భక్తుల కీర్తనలను టాగూరు గానము చేసి చేసి, యానందించెను. ఆ కీర్తనల యధికారము ఆయన రచించిన “భానుసింహపదావళి' యను గీతములందు సుస్పష్టముగ నంకితమై యున్నది.

కీట్సు సౌందర్యమును బోషించిన కవి. పెల్లి యింద్రియాతీతములైన ఆధ్యాత్మిక విషయములను గానము చేసిన తపసి. రవీంద్రుని కవిత్వమందు కీట్సు రచనలలోని రామణీయకము, షెల్లీ కావ్యములలోని యాధ్యాత్మిక తృష్ణయు,