పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

69

మతమును శిల్పమును ఒక పూవులోఁబుట్టిన రెండు రేకులని చెప్పవచ్చును. వాని రెంటికి మిక్కిలి సమీప బాంధవ్యము గలదు. ఒక దానినొక టి యపేక్షించి యవియన్యోన్య సహకారమువలన నభివృద్ధి చెందినవి.

వైదిక ఋషుల భావమును, కవిత్వ కల్పనాశక్తియు సమ్మిళితమయి, యందుండి యపూర్వ సృష్టులు బయలుదేరినవి. పౌరాణిక ప్రపంచమంతయు నిట్టి మతకవిత్వ సాంకర్యముయొక్క యద్భుత సృష్టియేకదా! ఇట్టి కల్పనలు లేకున్న మానవజీవిత మెంత సంకుచితముగ నుండియుండెడిదో !

మతమును, శిల్పమును ఆనంద సాక్షాత్కారమునకై పాటుపడుచున్నవి. గంతవ్య మొకటి; మార్గములు భిన్నములు,

“ఆనందా దేవ ఖ ల్విమాని భూతాని జాయంతి,
 ఆనందా దేవ జాతాని జీవంతి.
 ఆనందం ప్రయాన్త్యభి సంవిశంతి. "

ఈ భూతసృష్టియంతయు నానందమునుండి యుత్పన్నమగుచున్నది. ఆనందమున వర్ధిల్లుచున్నది. ఆనందము దిక్కునకే ప్రవహించుచున్నది. తుదకాయానందమును బ్రవేశించు చున్నది. శిల్పిసృష్టియు నిట్టిదే. భక్తుఁడును శిల్పియు నేది “సత్యం శివం సుందర'మో దానిని దర్శించుచున్నారు. ఈ యంతస్తునందు నిద్దఱికిఁగలభేదము నశించినది. కవి భక్తుఁడు, భక్తుఁడు కవి; శిల్పము మతము నొక్క టియే యైనవి.

మొదటి యనాగరక దశయందు మానవుఁడు పశుప్రాయుఁడై కామ్యసౌఖ్యములతో సంతృప్తిపడియుండును.