పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

కవికోకిల గ్రంథావళి

లలితకళలు జాతీయ జీవితమునందు అంతర్వాహినులై ప్రవహించు భావముల రమణీయాభివ్యక్తులే. కావున, వానియందు ముఖ్యములును, సర్వజనాదరణీయములును అగు భావములను ఆకర్షించి, శిల్పులు తమ రచనాచమత్కృతి వలన వానిని ఆదర్శకములుగ నొనరింతురు, ఇట్లనుట వలన మానవసమాజమును కళలును పరస్పర సాపేక్షకములని మన మూహింపవలయును. తాత్కాలికములైన భావములు కొన్ని ప్రజలను శిల్పులను ఆకర్షింపవచ్చును. అట్టివి క్షణికములు. కాని, కాలపారంపర్యముగ నొకజాతి యందు అస్థిగతమై మజ్జలో నాటుకొనియున్న భావములను మూర్తీభవింపఁజేయుట జాతీయశిల్ప మనఁబడును. అదియే లోకాదరణపాత్రము. తన వ్యక్తిత్వమును బోఁగొట్టుకొనక చిరంజీవముగ నుండును. తాత్కాలికములైన విజాతీయాను కరణములు మన స్వభావమునకుఁగూడ విజాతీయము లే కావున సత్యపటుత్వము కొఱఁతపడి కళాప్రపంచమునందు నిరాదరింపఁబడును.

ప్రాచ్యపాశ్చాత్యశిక్షణ మార్గములందుఁ బరస్పర వైరుధ్యము గోచరించుచున్నది. ఒకరికి శాంతియు నిరాడంబర మైన జీవనము ప్రధానము. మఱియొకరికి, తృష్ణ, చిత్త సంక్షోభము , ఆటోపము ముఖ్యము. నేతి చేఁ దడుపఁబడిన అగ్నిహోత్రమువలె భోగము లనుభవింపఁబడుకొలఁది వృద్ధిచెందుచుండుననియు, కావున భోగముల నియమితముగ గ్రహింపవలయుననియు నొకరిమతము. భోగముల వీలైనంతవఱకు వృద్ధిపొందించి వాని ననుభవింపనిదే నాగరకత