పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

57


వంతులు. వారి పలుకుబడివలన మానవసంఘము క్రొత్త క్రొత్తదారులు ద్రొక్కుచుండును. జాతీయత అట్టి యుదార హృదయుల భావసంపర్కముచేత నంతర్జాతీయతగఁ బరిణమించుచుండును. బుద్ధుడు, వాల్మీకి, ఏసుక్రీస్తు, మహమ్మదు మున్నగు మహాపురుషు లీతరగతికి సంబంధించినవారు. వారి జీవితమే యొక యుత్కృష్టమైన కావ్యము, వారి ప్రవర్తనమే నీతికి ఆదర్శకము..

ప్రతియుగమునం దోక్కొక్క భావము ప్రముఖమై యుండును. అది యాధ్యాత్మికమైనను, సాంఘికమైనను, రాజకీయమైనను, లేక మఱి యిం కేవిధ మైన మానవచర్యకు సంబంధించినది యైనను గావచ్చును. ఆ భావములందుఁ బ్రజల యాంతరంగిక దృష్టి లగ్నమై యుండును. ఇట్టిభావము సార్వజనీనముగ నుండక తప్పదు. దానిని కవియో, చిత్రకారుఁడో, ప్రవక్తయో, తన సృష్టిమూలమున బయలుపఱచును. మన మెల్లర మానాయకుని ననుసరింతుము. ఎందువలన? మనయందు అస్పష్టములుగను నిగూఢములుగను నున్న భావములను ఆయన వెలిబుచ్చును. ప్రజాబాహుళ్యము యొక్క భావములు అతని సృష్టియందు ఆది శేషావతారము దాల్చి రెండు వేలనాలుకలతో మాటలాడుచుండును. ఆయనకును మనకును సహానుభూతి గలదు. కావుననే యూ నాయకుఁడు మనలనాకర్షించును. అట్టి మహనీయుల యుద్దేశములు, సంభాషణములు, ప్రవర్తనములు విశ్వశ్రేయమును జేకూర్చు చుండును. ఏది విశ్వశ్రేయమును సంపాదింపఁగలదో యది నీతిబాహ్యముగ నుండనేరదు.