పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

34

కవికోకిల గ్రంథావళి

చున్నది. శకుంతలనాటకములోని కథ షుమారు ఆరు సంవత్సరములకాల పరిమితి గలదిగాఁ దోఁచుచున్నది. కాని, కాళిదాసమహాకవి దానిని రెండుమూడు గంటలలోఁ బ్రదర్శింపఁబడుటకు వీలగు నాటకముగ రచించెను. ఏయే కథా భాగములు గ్రహించినయెడల కథావిషయమునకు లోపము వాటిల్లక, శిల్పధర్మమునకు విరుద్దము గాక యుండునో అట్టిరీతిని ఉచితమైన సన్నివేశములన గల్పించి, ఆది మధ్యాంతములు గల యొక మనోహర దృశ్యమును రచించెను. లోక సామాన్యము లగు మానవచర్యలను గ్రహించి, వానిని లోకోత్తర వర్ణనాచమత్కృతి వలన అపూర్వమును, ఆదర్శ ప్రాయమునైన యొక విచిత్ర సృష్టినిగ మార్చివేసెను. ఇట్టి నిర్మాణమును సృష్టియందుమా! లేక యనుకరణ మందుమా! దీనిని అనుకరణ మనుటకంటె ప్రతి సృషి యనుటయే సమంజసము. అరిస్టాటలు గ్రంథమును చాల శ్రద్ధతో తర్జుమాచేసి, చక్కగ విషయము, బోధపడుట కొఱకు విపులమైన వ్యాఖ్యానము వ్రాసిన - ప్రొఫెసరు బుచ్చెరుగారు, అరిస్టాటలు ఉపయోగించిన 'అనుకరణము' అను పదమునకు, 'నిర్మాణము' 'ప్రతిసృష్టి' అను అర్థములు కలవని వాసియున్నారు.[1]

మమ్మటాచార్యులు కవిత్వమును నియతికృత నియమ రహిత మనియు, అనన్య పరతంత్రమనియుఁ నిర్మితి యనియుఁ


  1. 'Imitation' so understood is a creative act. It is a Rivalry of Nature, a completion of her unfulfilled purpose, correction of her failures.

    _ Butcher.