Jump to content

పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

కవికోకిల గ్రంథావళి


అను ధ్వని యిబ్సన్ నాటకములలో “వంశపారంపర్యాగత మానసిక శారీరక గుణావగుణము”ల బలముగా మాఱినది. ఈవిధముగఁ బ్రాణవంతమైన మానవసంఘముయొక్క మార్పులననుసరించి శిల్పతత్త్వనిర్ణయమునందును భేదములు తలయెత్తుచుండగా ఈ రహస్యమును గుర్తింపలేక, విత్తనము నుండి చెట్టు మొలచినను వేళ్ళకు నంటుకొని నిరుపయోగమయి క్రుళ్లి పోవుచున్న ప్రాఁత బొళ్ళెములను పట్టుకొని వ్రేలాడు రసలుబ్ధుల సంకుచితస్వభావము అనుకంపనీయము కదా!

ఇట్లనుట మన పూర్వికుల లక్షణ గ్రంథములనెల్లఁ ద్రోసిపుచ్చుట కాదు. వారిశక్తి సామర్థ్యములను గుర్తెఱుఁగక పోవుటకాదు. అనితర సాధ్యములగు వారిసిద్ధులను విస్మరించుట కాదు. వారి కీర్తికి భంగము కలిగింపవలయునను తలంపును కాదు. అట్లుచేయుట మన కాలి క్రిందికొమ్మను మనమె నఱకుకొనఁజూచుటయె. నేఁ జెప్పవచ్చినది ఏమనగా: ఎవ్వరును - అందువలననే మన పూర్వికులును సర్వజ్ఞులు కారు. ఎప్పుడో వేయిసంవత్సరములకు జురుగఁబోవుమార్పులను ముందే యూహించి వానికెల్ల లక్షణములు వ్రాయుట మనుజులకు సాధ్యముకాదు. అందుకయి పూర్వులపయి ధ్వజమెత్తవలసిన యవసరమును లేదు. కాని, మనకులేనివి యితరులవలన గ్రహించినఁదప్పేమి? మనవిజ్ఞానమంతయుమనసొంతము దేనా? ఎన్ని జాతులు హిందూదేశముపై దాడి వెడలినవి? ఎన్ని విధములైన నాగరకతలతో మనకు సంబంధము కలిగినది? ఇట్టిసాంగత్యమువలన మనజాతియందును, విజ్ఞానమునందును, మార్పులు