పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

249


కలుగ లేదా? ఇది క్రొత్తయా ? కులము చెడుటకు రసలుబ్ధుఁడు ఇప్పుడు ఉలుక నేల? ప్రాఁతవానిపై గౌరవము క్రొత్త వానిపై ద్వేషముగ మాఱకూడదు. సనాతన లాక్షణికుల యజ్ఞ వేదికల కడ ఆధునిక కవికుమారుల సృష్టులను బలి యీయరాదు. సృష్టికిఁ గ్రొత్త ప్రాఁతలు లేవు. అది యెప్పటికిని అభినవమే.

III

నాటకము రచింపఁ దలఁచుకొన్నపుడు, కవి భావమునందు ముఖ్యపాత్రలు పొడకట్టి భావింపను భావింపను ప్రస్ఫుటములగును. వానిచుట్టును, అయస్కాంతముకడకు ఇనుప ముక్కలు పరుగెత్తునట్టులఁ దక్కినపాత్రలు మూఁగుదురు. ఈభావ ప్రతిమలు ప్రాణవంతములై యథార్థములట్లు తోఁచును. ఈయంతర్నాటకము బహీరాకృతి దాల్చఁబోవు నప్పటి యావేదనమును, మనో నిబ్బరత్వమును, సృష్టిప్రేరకములగును. కళాసృష్టికి ఆదిమధ్యాంతములు గలవు. అది యవయన సమన్వితమైన యాకృతి, అందు అవయవములకు అనురూప త్వము సహజముగఁ బొసఁగియుండును.

నాటక స్వరూపము "గోపుచ్చాకృతి" అని పూర్వులు నిర్వచించి యున్నారు. నాటక వస్తువు ఏదియైన నొక స్పర్ధను (con : tet) ఆశ్రయించుకొని యుండును. ప్రాణికిని విధికిని, వ్వ క్తికిని సంఘమునకును, మంచితనమునకును చెడ్డతనమునకును, భిన్న సంకల్పములు గల మనుష్యులకును, భిన్న మతములకును స్పర్దపుట్టినపుడు దాని యుత్పత్త్యున్మీలనోపసంహారములే నాటకరూపమును ధరించును. ఈ పరస్పరస్పర్ధ వధాంత నాటకములయందు మఱింత వ్యక్తమగు చుండును,