పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

247

కొంతకాలము జరిగినది. రాజకీయ సాంఘిక విప్లవములు, మానవసంఘమునఁ జిరకాలము వేళ్ళునాటుకొని యున్న పూర్వనీతులను, భావములను, పెకలించి వైచినవి. మానవుని విజ్ఞాన ప్రపంచము దినదినము విరివియగుచున్నది, ప్రజాస్వామ్యములు గుర్తింపఁబడినవి. ప్రజాప్రభుత్వమే ఆదర్శకమను మూలసూత్రము అంగీకరింపఁబడినది. సర్వ మానవ సమత్వము నిరూపించుటకుఁ బ్రవక్తలు, వక్తలు, సంస్కర్తలు తమజీవితముల ధారవోయుచున్నారు. ఈ విప్లవము, ఈ సంచలనము కళలయందును బ్రతిఫలింపదా ? ప్రతిఫలించినది. నవయుగ ప్రభాతమును సూచించు వేగుఁ జుక్క యోయనునట్లు 1828-వసంవత్సరమున నార్వే దేశమున ఇబ్ సన్ అను నాటకకర్త జన్మించెను. ఈతని సిద్ధాంతము లేవియనిన: స్వగతము, జనాంతిక ము, ఆకాశభాషణము మొదలయిన నాటక సమయములు రచనయొక్క బాల్యావస్థను దెలుపునవి. ఇట్టి అస్వాభావిక సాధనసంపత్తి సాహాయ్య మపేక్షింపకయె నాటకములు రచింపవచ్చును. ట్రాజెడీ కథానాయకుఁడు రాజుగా నుండవనసిన యవసరము లేదు. కడపటి రంగమున నెత్తురు కాలువలు పాఱింపకయె అద్భుతమైన ట్రాజెడీని సృజింపవచ్చును. సామాన్య మానవుఁడు సాంఘిక జీవితమునందుఁ బ్రతిదినము అనుభవించు విషయములో నెంతో ట్రాజెడీకలదు. నాటకము వినోదముకొఱకై రచింపఁబడునది కాదు, సంఘమును శుద్దిపఱచుటకు. ఈ సిద్ధాంతములే “Problem Plays" అను సాంఘిక నాటకములకు మూలములైనవి. 'షేక్ స్పియరు నాటకములలోని "విధి బలీయము"