పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

కవికోకిల గ్రంథావళి


కవులవద్ద కొంత అహంభావం ఎరువుతీసుకొని సాహసం సంపాదించి, చిత్రలేఖను చేరదీశాను.

చూచారా మానవస్వభావంలో ఉండే చిత్రం. నా యిల్లాలికి మనసులో ఈర్ష్యపుట్టింది. నన్ను వేటాడడం మొదలుపెట్టింది. నేను కొంచెం మూతిబిగింపు చూపినాను. మౌనము ధరించాను.

నేటికైనను నా యున్కి నీకుఁదలఁపు
వచ్చె; నది కొంతభాగ్యంబు మెచ్చుకాడ,
బహుళ సంతానవతియైన భార్యవలపు
సాటిగాదయ్యెఁ గొందగు లాటమునకు.
ప్రేమసూత్రాలఁ ద్రెంపెడి బిగువుసడలి
బిచ్చకత్తియపోల్కి నీ పిలుపులేక
వచ్చినిలిచితి ముంగిట, నిచ్చకాల
కైనఁ దలయెత్తి చూడవు మౌనివైతె ?

అంటూ పూర్వప్రేమను తోపింపజేస్తూ, బొటనవ్రేలు నేలరాస్తూ కన్నీరునింపింది. చిత్రలేఖకు నాకు కలిగిన సాంగత్యం ఫలప్రదం కాకపోయినప్పటికినీ కవితకు నామీద ఉన్న పూర్వప్రేమ యింకా మాసిపోలేదని ఋజువు చేసింది. బయటికి తెచ్చికోలు బిగింపుచూపినా లోలోపల నా హృదయం వెన్నవలె కరగిపోయింది. అన్నానుగదా :

నిలునిలుమోసఖీ, మనసు నిరయిపోయయె; నవజ్ఞగాదు; నీ
వలె ననుజేరవచ్చె బహువర్ణ సుశోభిత చిత్రలేఖ, నే
వలదనఁ జాలనైతి; నెలప్రాయము మోసముఁజేసె; నిక్కముం
దెలిసిన నీవునుం జెలినిఁ దియ్యని కౌగిటఁజేర్తు వింతకున్