పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

కవికోకిల గ్రంథావళి

ప్రకృతి రామణీయకము వర్ణించుటయందు పూర్వ కవులకును ఆధునికులకును దేశకాల పాత్రభేదముల ననుసరించి కొంత తారతమ్యము కొంత విభిన్నత అగపడుచున్నది. దీనికి ఆలంకారిక మతముకూడ యొక కారణమై యుండును.

రసవాదము భరతముని నాట్యశాస్త్రమున నిర్వచింప బడినది. బహుశా ప్రభవించినదనికూడ చెప్పవచ్చును. నాట్యమునందు నాయికా నాయకులు ముఖ్య పాత్రలు. తక్కిన వెల్లను ఔపచారికములు. కావుననే ప్రకృతి మానవచర్యలకు కేవలము భిత్తిమాత్ర ప్రయోజనము (Back ground) గా రెండవస్థానము నలంకరించినది. కావ్యములు గూడ క్రమ క్రమముగా ఈ పద్ధతినే అవలంభించినవి. వాని యందును మానవచర్యలే ముఖ్యములు, మానవచర్యలతో సంబంధము లేని ప్రకృతివర్ణనమునకు తావులేదు. మానవ చర్యలకు సంబంధించి, రసపోషణకు కావలసిన మాత్రము ప్రకృతివర్ణనము గ్రాహ్యమని వారి మతము. అనాగరక జాతుల చర్యలు మానవేతరములైన పశుపక్ష్యాది జంతువుల చర్యలలో రసాభాసముతప్ప రసమునకు పరిపూర్ణత చేకూరదని వారి తలంపు.

ఈ మతమును ప్రతిఘటించినవాడు ఆలంకారికులలో అభినవుడు జగన్నాథ పండితరాయలు, రమణీయార్థమును ప్రతిపాదించు శబ్దమే కావ్యమని నిర్వచించి కవితానర్తకి నాట్యరంగము సువిశాలమొనర్చి మహాకవుల రచనలకు గతికల్పించినాడు. లేక, మహాకవుల ప్రతిభను పండితరాయలు గౌరవించినాడనికూడ చెప్పవచ్చును. అట్లు కాని