పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేటికవిత - ప్రకృతిపూజ

209


ప్రయత్నించియే యున్నారు. శ్రీనాథుడు తన కవిత్వమును నవ్యమని చెప్పుకొనెను. తెనాలిరామకృష్ణకవి "స్కంద పురాణ నీరనిధి కౌస్తుభమై ప్రభవించి దేవకీనందను సత్కధోద్యమము నవ్యకవిత్య కళాకలాపమన్" కుందనమున్ ఘటించి కడుక్రొత్త సొమ్మొనరించి ” అని నుడివియున్నాడు. ఇచ్చట నవ్యకవిత్వ కళాకలాపము, క్రొత్తగు సొమ్ము అను మాటలు ముఖ్యముగ గమనింపతగినవి. చేమకూరు వెంకన్న తెలుగు కవిత్వమున క్రొత్తపద్ధతిని ప్రవేశపెట్టెను. ఆ రచనలోని నవ్యతను, అపూర్వతను తన సమకాలికులు మెచ్చుకొనవలసినంత మెచ్చుకొనలేదని పాప మానవ్యకవి 'ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చ రేగదా! అని ఆశాభంగమును వేడినిట్టూర్పుతో ప్రకటించెను, మార్పులు కోరినది నేటికాలపు కవులు మాత్రమేనని పొరపడుటవలన మన చారిత్రకదృష్టి, నశించి, పూర్వకవిత్వ మన్నంతనే అసహ్యపడుట ఒక నాగరక ఆచారముగ పరిణమించినది. 1910 వ సంవత్సరము మొదలు ప్రారంభించిన నవ్య కవుల రచనలు 1935 వ సంవత్సరమునాటికే పూర్వకవిత్వముగా మారిపోయినదన్న విషయము నవ్యకవులు జ్ఞప్తి పెట్టుకొన్న యెడల పూర్వ కవిత్వమును అంతగా ద్వేషింపవలసిన అవసరముండదు. మొదటి నవ్యకవులకు పూర్వకవుల రచనలేగదా మానాలు, అభిరుచుల ననుసరించి కొందరకు తిక్కన, కొందరకు శ్రీనాథుడు, మరికొందరకు పింగళి సూరన పెద్దన లేగదా అభిమాన కవులు; తరువాత వారి వారి నైజ ప్రతిభ ననుసరించి మార్పులు చెందియుండవచ్చును.