పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేటికవిత - ప్రకృతిపూజ

211


యెడల, రసవాదప్రకారము కాళిదాసుని కుమారసంభవములోని “మధుద్వి రేపః కుసుమైక పాత్రే పపౌప్రియాం స్వామను రక్తమానః " అను శ్లోకమును, దానివంటి మరికొన్ని రమణీయ శ్లోకములును రసాభాసమునకు దృష్టాంతములు కాగలవు. మను చరిత్రలోని “ఏ విహంగముగన్న యెలుగించుచునుసారె” అను చక్కని సీసపద్యము రసాభాసమగును. ఇంత యెందుకు రతి ఉభయనిష్టము కానందువలన మనుచరిత్రకథే రసాభాసము, లోకము ననుసరింపని శాస్త్రమెట్లున్న నేమి, మనుచరిత్ర రమణీయముగ నుండుట లేదా? కావ్యలక్షణములు కొన్ని నాట్యశాస్త్రమునుండి దిగుమతి యగుటవలన యిట్టి యిబ్బంది కలిగినది. లోకము ప్రమాణమన్న సంగతి యేమైనది.

ఆధునిక కవులు అస్వాభావికపు కట్టుబాట్లను ఉల్లంఘించినారు గావున వారు కావించిన ప్రకృతివర్ణనములు ఒకొక్కప్పుడు నాయికా నాయక నిరపేక్షకముగాకూడ నుండును. ప్రొద్దుపొడుపులు, మునిమాపులు, సెలయేళ్లు, వనములు, కొండలు, మేఘములు, చంద్రోదయము, అవి యివి యననేల, రమణీయమైన బాహ్య ప్రకృతి యంతయును మానవచర్యల సంబంధము లేకున్నను తమంతతామె మనోహర దృశ్యములుగ నున్నవి. అవి కవికి ప్రత్యేక వర్ణనీయములు. ఇంగ్లీషువారి Lake poetry, Nature poetry ఈ తెగకు చేరినవి.