పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

196

కవికోకిల గ్రంథావళి


మనుష్యసమాజమునకు దేవోపాసనమార్గము సుగమ మొనరించుటకు బ్రహ్మచేఁ బ్రేరితులైన దేవతలు తమతమ మూర్తులను గల్పించుకొన్న విధానము ద్వితీయాధ్యాయమున వివరింపఁబడియున్నది.

చక్రవర్తి చిత్రలక్షణములను ఈ గ్రంథము ముఖ్యముగ బోధించుచున్నది. శిల్పరచనా పద్ధతియందును, శిల్ప నియమములందును బ్రాచీన హైందవ, బౌద్ధ, జైన సంప్రదాయములకు విశేష భేదము లేవియుఁ గానరావు. గాంధార దేశమునందలి యనేక భాస్కర్య నిదర్శనములవలన అందొక ప్రాచీన చిత్రకళా సంప్రదాయముండె నని యూహింపఁ దగి యున్నది. టిబెట్ దేశముయొక్క మతసంబంధమైన చిత్ర రచన గాంధార చిత్రకళకు సంబంధించిన యొక శాఖగఁ దలంపవచ్చును.

బాజ్నాయును ఒయాయ్-చి-ఇ-సోంగ్ అను నిరువురు చిత్రకారులు భారతీయ చిత్రశిలాదర్శనములను కొరియా, చీనా దేశములఁ బ్రవేశ పెట్టిరని చీనా దేశమందొక నానుడి కలదు.

ప్రతిమలు కొలతవేయుటయందు అంగుళియె ప్రమాణముగఁ గైకొనఁబడినది ఎవని (యే దేవత) చిత్రము లిఖంపబడునో యాతని (ఆ దేవత) అంగుళియె ప్రమాణముగఁ దీసికొనవలయును. భిన్న భిన్న పరిమాణములు గలవిగ నున్నను ఆయా చిత్రములందు , అంగప్రత్యంగ పరస్పరానుగణ్యము కొఱకు నిట్టి నియమము ఉద్దేశింపఁ బడినది.