పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రలక్షణము

197

చక్రవర్తి పురుషుని రూపవర్ణనము :- చక్రవర్తియైన భూపతి మేఘ ముక్తాకాశమునందలి చంద్రునితోడఁ దుల తూగును. ఆతని శరీరము చుట్టును ప్రభామండలము చిత్రింపఁ బడవలయును. ఆతని ముఖమండలము చంద్రప్రభవలె శుభ్రమైయుండును. ఆతని భ్రూయుగళమును, గ్రీవమును, ఫాలమును అత్యంతసుందరములు. అతని కేశముల వర్ణము ఉ్యలముగను గోమలముగ నుండును; నాసిక యున్నతము గను చక్కగ నుండును; అదరోష్ఠములు రక్తవర్ణ భూషితములు. అతని దంతములు ముక్తాఫల ధవళములు; నేత్ర ద్వయము ఆకాశమురీతి నీలమును, సుదీర్ఘ విశ్రాంతమును, ఆతని భ్రూయుగళ మధ్యప్రదేశమునఁ దేజఃపుంజము శోభించుచుండును. ఆతని శుభ్రకాయ మతిసుందరరూపముగఁ జిత్రింపఁబడును. కర్ణద్వయము సమభావముగఁ జిత్రింపఁబడును. ఆతని కంఠము శంఖసదృశము; స్కందద్వయ మధ్యవర్తిస్థానము పరిస్ఫుటము; పదములు హస్తములు పుష్కలములు; శరీరము మాంసలము, నాభిదక్షిణా వర్తనమును గంభీరమును; ఆతని శరీరము సకలప్రదేశము లందు గుండ్రముగ నుండును. మఱియు సంధిస్థలములు (కీళ్ళయుబ్బులు) దృష్టి గోచరములు కావు. ఆతని యూరు ద్వయము ఏనుగ తొండమువలె గుండ్రముగ నుండును; గోళ్లు అర్థచంద్రాకారములు; పదతలము ఛత్రచిహ్నితము; అంగుళి పొడవుగను గుండ్రముగ నుండును. అతని వర్ణము చంపక పుష్కమువలె గౌరవముగ నుండును.