పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభినవాంధ్ర సాహిత్యము

187

నఖలు నఖలు బాణః నన్నిపాత్యో౽య మస్మిన్
మృదుని మృగశరీరే పుష్పరాశా వివాగ్నిః.

దుష్యంతుడు ఆశ్రమ మృగమును తరుముకొని వచ్చుచుండగా కణ్వశిష్యులు చూచి దానిని రక్షింపనెంచి, “ఓ రాజా, యిది యాశ్రమ మృగము, దీనిని చంపదగ" దని చెప్పిరి. ఆశ్రమ కురంగమని బెదరు పెట్టినంతనే సార్వభౌముడు భీతిల్లి దానిని వదలునా? దుష్యంతుడు మృగయా ప్రియుడు. వేటాడుటకొఱకే వచ్చెను. జీవహింస క్షత్రియులకు క్రొత్తది కాదు. కావున వైఖానసులు ఎట్లయిన రాజు హృదయమును కరుణార్ద్రము కావించి మృగమును రక్షింపవలయును. అట్టి యెడ ‘‘మృదువైన మృగశరీరమునందు బాణము ప్రయోగింపవలదు” అని బ్రతిమాలిరి. మృదువు అను విశేషణము బాధ నోర్చుకొనలేని కోమలత్వమును స్పురింప జేయునుగాని, ఎంత సుకుమారమని వైఖానసుడు చెప్పిన రాజు హృదయము ఆర్ద్రమగునో అంత సౌకుమార్యమును స్పురింప జేయుటకీ విశేషణము చాలదు. కావున వైఖానసుడు ఆ భావ తీవ్రతను, సాంద్రతను ఇట్లు ప్రకటించెను : 'రాజా, నీవు మృగముపై బాణము వేయుదువేని పూలరాశిలో అగ్గి పెట్టినట్లే !' పూవులు చాల పేశలములైనవి. తాకిన కంది పోవునవి. తల నిడికోదగినవి. తన ప్రేయసి ధరియించునవి. తాను ప్రణయ బహుమానముగ గొన్నవి. దేవుని పూజించుట కర్హ మైనవి. ప్రకృతిదేవీ దరహాసముల వంటివి. మనోహరములైనవి. ఇట్టి పూలకు నగ్ని రగల్చినట్లగునా! ఈ కార్యము క్రూరము ఘోరము. ఎంత కర్కశాత్ముడైనను