పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

కవికోకిల గ్రంథావళి

భాష యెప్పటికిని భావములకంటె వెనుకపడి యుండును. భావములు మాఱినంత సుళువుగా భాష మాఱదు. అయినను కార్యకుశలుడు కొఱముట్లులేని లోపమును ఎట్లో పూర్తి చేసికొనును. ప్రతిభావంతులగు కవులు, గ్రంథక ర్తలు జన్మించి సమకాలీన భాషను తమ కూర్పు నేర్పుచేత వివిధ భావ ప్రకటనార్హముగ నొనరింతురు. పదజాలము సంకుచితమయ్యున్నను కవి ఆవశ్యకమునుబట్టి ఒక యింద్రజాలముపన్ని భాషా దారిద్ర్యమును అతిక్రమించును. పూర్వమునుండియు కవులు కావ్యములలో ఉప మాద్యలంకారములను వాడుచున్నారు. భామహుని కాలమున నాలుగు అలంకారములె గుర్తింపబడినవి. కాని క్రమ క్రమముగ విమర్శకుల పృథక్కరణ శక్తివలన అలంకారములు పెక్కులయి మనమువ్రాయు ప్రతి వాక్యము, సమాసము, ఏదో యొక యలంకారము క్రిందికి వచ్చునట్లైనది. కాని మొట్ట మొదట యలంకారముల నుపయోగించిన కవి, అవి యలంకారములని, కవితకు మెఱుగు పెట్టుటకుగా వాని నుపయోగించుచున్నానను జ్ఞానముతో శాక, తాను ప్రకటింపదలచిన భావ తీవ్రతను మొక్కవోక స్ఫురింపజేయుటకు పడిన కడగండ్లే యీ యలంకారములని నా యుద్దేశము. తాను చెప్పదలచుకొన్న భావమునకు ఉచితమైన పదము భాషలోనుండిన ఈ యుపమాద్యలంకారములకు అవసర ముండదు. భాషకు సహజమైన లోపమె యీ యలంకారములకు మూలము. ఒక యుదాహరణము చూడుడు: