పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకము : చరిత్రము

137

రుచించుట అది ఆనందముతో పాడుచుండుట వలనగాదు; దాని కంఠస్వరమున మాధుర్య ముండుటవలన. కాకికూడ అట్టి ఆనందముతోనేగదా పాడును! దాని గానము మన కేల రుచింపదు?

కవినిర్జరారణ్య ప్రదేశమున కూర్చుండి తన యిచ్చ వచ్చినట్లు పాడుకొనిన చిక్కేమియు లేదు. ఏ నీతియు, నియమము అవసరము లేదు. తానే తుమ్మి తానే దీవించుకొన వచ్చును. కాని, కవి మానవ సంఘములో నొక వ్యక్తిగ నుండి, తన కావ్యవస్తువు మానవసంఘము నాశ్రయించి యుండునెడల, తానెట్లు నిర్బాధ్యముగ పాడుకొనఁగలడు?

ఈ వాదమునందు అనుభవ వ్యతిరేకమైన అసత్యము ఒకటి కలదు. కవి ఆనందముపట్టలేక పాడుకొనునా? కవి రచించునప్పుడు తన మనస్సులోనుండు ఒత్తిడిని ఆనంద మనవచ్చునా? లేక వేదన యనవచ్చునా? మనస్సు ఱెక్కలు విప్పుకొననిదే (Mental relaxation కలుగనిదే) ఆనందము జనింపదు. రచనా సమయమున కవి మనస్సు చక్కగ శ్రుతి చేయఁబడిన వీణాతంత్రివలె బిర్రబిగిసికొని యుండును; ఏ మాత్రము తగిలినను తెగును; ఆ సమయమున నెవ్వఁడైన పిలిచినయెడల అమాంతముగ వానిపైనఁబడి గొంతు నులిమి వేయవలయునను కోపము పుట్టును. ఒకప్పుడు మంచముపై కూర్చుండి వ్రాయుచున్నామా? లేక క్రిందకూర్చుండి మంచముపై నోటుబుక్కు పెట్టుకొని వ్రాయుచున్నామా? యను జ్ఞానముకూడ నుండదు. కలలో పద్యములు, నిదుర మేలుకొనునపుడు పెదవులపై పద్యములు, రేయుంబవళ్ళు నాలు