పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

కవికోకిల గ్రంథావళి


వలయుఁగృతికి” అను అప్పకవి వచనమునందుఁ గళారహస్య మున్నది. ఒక మనుచరిత్రమే కాదు- కొంచెమించుమించు పూర్వకావ్యములలో చాలవఱకు నిలుకడగా రచింపఁబడినవే. “ఏకైక దినప్రబంధఘటికా సద్యశృత గ్రంథకల్పను " అని రామరాజభూషణుఁడు తన్ను గుఱించి చెప్పుకొనియున్నను వసుచరిత్రము ఒక్క దినములో వ్రాయఁబడిన ప్రబంధము కాదు కడపటి సవరణయయి పూర్తియయిన దనుటకు గొన్ని సంవత్సరములు పట్టియుండును; అనఁగా తన జీవిత కాలమునందు రెండుమూడు కావ్యములకన్న నెక్కుడుగ రచించియుండఁడు. ( నెఱవడి కుదురుటకై వ్రాయఁబడు కాపీ పుస్తకముల వంటివి యెన్ని యేని ఉండవచ్చును, అవి లెక్కలేదు. ) ఆ కాలమున రాజాస్థానములె కవులకు శరణ్యములు. ఆస్థానపండితులు స్థనశల్య పరీక్షచేయు బిరుసు విమర్శకులు. ఇట్టి అగ్నిపరీక్షలో తేరి తెప్పరిల్లిన కావ్యములె గౌరవ యోగ్యము లగుచుండెడివి. ఇట్లనుట వలనఁ బూర్వ కావ్యములన్నియు నీతరగతికిఁ జెందినవని కాదు.

ఇప్పటి పరిస్థితులు వేఱు: వార్తాపత్త్రికలు మాసపత్త్రికలు ప్రబలినవి. ఆపత్త్రికల పుటలు నిండుటకు విషయములు కావలయును. కవులును, వ్యాసకర్తలును ఏదో యొక మొగమోటమిచేత ఏదియైన కొంత (కాగితములు నిండుటకు) వ్రాసిపంపవలసి యుండును. కాగితముపైని సిరాతడి యారకముందె ఖండకావ్యము పోస్టులోఁబడును. ప్రూఫులు సరిచూడక పూర్వమె (అవక తవకగా చూచి యని యర్థము)