పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

128

కవికోకిల గ్రంథావళి


యచ్చర కొలమున నుద్భవించినను ప్రవర్తనము భిన్నము. తుదకు పేశల హృదయ. ఆత్మహత్యకూడ చేసికొన ప్రయత్నించినది. వరూధిని ప్రవరుని వరించునప్పటికిఁ గన్యాత్వము చెడినది కాదు “ఆవధూటి ప్రధమసురతంబు గంధర్వపతి గరంచె” అని చెప్పఁబడియున్నది.

వరూధిని ప్రవరుల సంగమము తన కిష్టమయ్యును కవి వదలివేసెను. అందుకు పరిహారముగ మాయాప్రవరుని మూలమునఁ గొంత రహస్య సంతృప్తిగాంచెను. కవి చంద్ర వర్ణనమునందు (సందేశమునకుఁ దావుండదు గదాయని) తన యభిప్రాయమును వెల్లడించెను. “ప్రకృతి నచ్చుండైన సన్మార్గి యెన్నటికిం గూటమివంక వచ్చు వికృతిన్ మగ్నుండుగానేర్చునే” అని వెల్లడించెను. ప్రవరుఁడు శుద్దప్రకృతికిఁ గలిగిన వాఁడేయైనయెడల వరూధినీ సంగమమువలన వచ్చు వికృతికి భయపడవలసిన యవసరముండదు, అది క్షణికము. ప్రవరుఁడు అసంతృప్త హృదయమును సంతోషపెట్టి యోదార్చి పోయి యుండవచ్చును,

రావణుఁడు సీత నెత్తుకొని పోయినప్పుడు రాముఁడు పలవించెను. ఆ శోకవేదనకుఁ జెట్లుకూడ తలలువాంచి యల్లాడెను. ప్రకృతియంతయుఁ గన్నీరునించెను. పెద్దనకూడదుఃఖత యగు వరూధినిపైఁ బ్రకృతి కనికరించినదని వర్ణించెను. కర్మసాక్షియగు సూర్యభగవానుఁడు ప్రవరుని పాషాణహృదయత్వమునకు వెక్కసమంది రోషభీషణ స్ఫురణవహించెను:

<poem> తరుణి ననన్యకాంత, నతిదారుణ వుష్ప శిలీముఖ వ్యధా భరవివశాంగి నంగభవు బారికి నగ్గము సేసి క్రూరుఁడై

/poem>