పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

కవికోకిల గ్రంథావళి


కూలవతియైన యిల్లాలిని అన్యాయము సేయుటగాఁ దలంచి, ప్రయత్నపూర్వకముగఁ దనరోకలఁ జిక్కఁబట్టవచ్చును. ఇట్టి పరస్పర భావసంఘర్షణమునుండి ధీరుని సంకల్పము నిర్మలమయి దృఢమయి యెట్టకేలకు జయము నొందును ప్రవరుని యీ మనోనాటకము మనకుఁ జూపట్టిననే యాతని పై మనకు సానుభూతి కలుగును; లేకయున్న అతఁడుపాషాణ హృదయుఁడని దూషింతుము.

పెద్దన కీ శిల్పనైపుణ్యము కొఱవడి యుండినదా? కొఱవడియుండిన అంతటి మానుషత్వముగల వరూధిని నెట్లు సృజింపఁగలడు ? అట్లయినఁ బ్రవరుని ఏల యిట్లు యంత్ర విగ్రహముగఁ దీరిచెను? ఒకటిరెండు కారణములు కలవు. పెద్దన రాజసము కలవాఁడు. "రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురవిడె మాత్మకింపయిన భోజన ముయ్యెలమంచము” కావలసిన భోగప్రియుఁడు. పోతనవలె “హాళికులైన నేమి?" యని స్వశ్రమార్జితము పట్టెఁడన్నము తినుటకు వలయు త్యాగశక్తికలవాఁడు కాఁడు. కావుననే రాజాశ్రితుఁడు. పూర్వాచార ప్రియమైన పండితాభిప్రాయమును బొత్తిగ నిరశించుటకు వీలులేనివాఁడు, అందువలన, పండిత లోకమును సంతృప్తిపరచుటకు ప్రవరుని ఆవిధముగఁ జిత్రించెను. జీవితయాత్ర సునాయాసముగ జరిగిపోవుట కట్టి రాజీయే అవసరమేమో!

పెద్దన ప్రవరుని అంతటి కర్కశహృదయునిగ సవరింపక పోయినయెడల మనుచరిత్ర అధమ కావ్యమని దూషింపఁ