పుట:Kavijeevithamulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

కవి జీవితములు

గీ. చేయఁ దక్కువ యైన దేవాయతనము, లపుడు పూర్తిగఁ గట్టించి యలరుచున్న
   చోట నొకనాఁడు తిక్కనసోమయాజి, వచ్చె నెల్లూరినుండి భూవరునికడకు.

సీ. వచ్చిన నయ్యార్యవర్యు నెదుర్కొని, వినయసంభ్రమభక్తు లినుమడింప
   నతిథిపూజ లొనర్చి యతనిచే భారతా, ర్థమును ద్వైతాద్వైతతత్త్వములును
   విస్తృతచిదచిద్వివేకలక్షణములు, ప్రకటధర్మాధర్మ పద్ధతులును
   రాజనీతిప్రకారంబును భారత, వీరులమహిమంబు వినుచు నుండి

గీ. యనుమకొండనివాసు లైనట్టిబౌద్ధ, మునుల రావించి వారిఁ దిక్కనమనీషి
   తోడ వాదింపఁ జేసినఁ దొడరి వాండ్ర, జులకఁగా సోమయాజులు గెలుచుటయును.

వ. అప్పుడు బౌద్ధదేవాలయంబులు గూలం ద్రోయించి గణపతిదేవరాజు సోమయాజులపటువాక్యశక్తికి మెచ్చి యతని బహుప్రకారం బులఁ బూజించి యెనిమిది గ్రామంబు లొసంగి యతఁడు వచ్చినకార్యం బడిగిన నాభూవరునకుఁ గవివరుం డిట్లనియె."

సోమయాజి మనుమసిద్ధిరాజునకుఁ గలిగినవిపత్తు తెల్పుట.

పైని చెప్పినవిధంబున సోమయాజి బౌద్ధమునులను జయించి గణపతిరాజుతో నెల్లూరునకు బ్రభుం డగుమనుమసిద్ధిరాజునకు దాయాదులవలనఁ గలిగినరాజ్యవిహీనతవిధంబు తెల్పెను. ఇట్లు తెల్పి ఆమనుమసిద్ధి రాజుయొక్క దాయాదులఁ బాఱఁదోలి అతనిరాజ్య మాతనికి నిప్పింపుఁ డని చెప్పిన విని గణపతిదేవరా జందుల కంగీకరించి, నవలక్షధనమును, యజ్ఞకుండలములును తిక్కనసోమయాజికి బహుమాన మిచ్చి పనిచెను.

గణపతిదేవునిమంత్రింగూర్చి సోమయాజి రాజుతో ముచ్చటించుట.

ఇట్లు సోమయాజి గణపతిదేవరాజువలన స్వదేశంబునకుఁ బోవుట కనుజ్ఞాతుండై గణపతిదేవునిమంత్రి యగు "శివదేవయ్య" అను నతనిం జూచి గణపతిదేవునితో నిట్లనియె. "రాజా ! ఈమంత్రి దేవుండు గాని సామాన్యమనుష్యమాత్రుండు గాఁడు. నీవు రాజ్యభారం బితని యనుమతంబునఁ జేయుట శ్రేయోదాయకము" అని సోమయాజి చెప్పి నిజనివాసంబునకు జనియెను.