పుట:Kavijeevithamulu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

85



సోమయాజి వచ్చె ననియు నపుడు కొన్ని రాజకీయవ్యవహారములును మతసంవాదములు నడిచె ననియుం జెప్పి యున్నది. ఇట్టివృత్తాంతము లావంశచారిత్రముం దెల్పుగ్రంథములన్నిటిలోపల నేకరీతినే కాన్పించును. ఆగ్రంథములలో నొకటిరెండు ప్రామాణికగ్రంథములుగఁ గాన్పించును. అందు మొదటిది వచనకావ్యము. ఇది పుట్టి యిప్పటికి 300 సంవత్సరములకుఁ బైఁగా ననఁగా శా. సం. 1500 సమానకాలములోఁ బుట్టి యుండును. రెండవది దానికే పద్యకావ్యము. అది పుట్టి 150 సంవత్సరములై యున్నది. ఈరెండుగ్రంథములును గోదావరీమండలములోని రహితాపురము రఘుదేవపుర మనునామములతో నొప్పు పట్టణమునకుఁ బూర్వపుజమీన్‌దారు లగుమందపాటివా రనుక్షత్రియ ప్రభువులవలన సంపాదింపఁబడినవి. అందుఁ బద్య కావ్యము కూచిమంచి తిమ్మకవిసార్వభౌమునితమ్ముం డగుజగ్గకవివలనఁ బై మందపాటివారిపైఁ గృతియియ్యఁబడినది. పై రెండుగ్రంథములలోపలంగూడఁ దిక్కనసోమయాజివృత్తాంత మొక్కవిధముగనే వ్రాయంబడి యున్నది. కావున వచనకావ్యములో నున్న దాని నిట వివరించెదను. ఎట్లన్నను :-

"గణపతిరా జేకశిలానగరంబునకు వచ్చి, తనకు మరలఁబడ్డతమ్ములం బ్రహరించి తాను పట్టాభిషిక్తుఁడై యోరుగంటికి శిలాప్రాకారంబుగాఁ గోట నేర్పఱచి, చేయం గడమపడిన దేవాలయంబులను బూర్తిగాఁ గట్టించి యున్న సమయంబునఁ దిక్కనసోమయాజు లేతెంచిన గణపతి దేవు లెదుర్కొని పూజించి యతనిచేత భారతార్థంబులును, ద్వైతాద్వైతంబులును, చినచిద్వివేకంబులును, ధర్మాధర్మంబులును, రాజనీతి ప్రకారంబులును, భారతవీరుల ప్రభావంబులును నాదిగాఁ గలయర్థంబులు వినుచుండె. అట్టిసమయంబున నొక్కనాఁడు తిక్కనసోమయాజి యనుమకొండనివాసు లైనబౌద్ధమునులతో వాదించి యెనుబదినల్గుర బౌద్ధమునుల నఱికించె. అనంతర మాగ్రంథములో గణపతిదేవుఁడు తిక్కనసోమయాజికి నెన్మిదిగ్రామంబులును, నవలక్ష ధనంబును, స్వర్ణకుండలములును బహుమానంబుగ నిచ్చె."

అని యున్నది. ఈవృత్తాంతము పద్య కావ్యములోఁగూడ విశేష భేదము నొందకుండ నున్నది. ఎట్లన్నను :-

"గీ. వచ్చి తనకు మఱలఁబడ్డతమ్ములను హ, రించి సకలగహ్వరీస్థలికినిఁ
    బ్రాజ్ఞు లెన్నఁగాను బట్టాభిషిక్తుఁడై వీటికొక్కఱాతికోట నిలిపె.