పుట:Kavijeevithamulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

55



కొన్ని ఘట్టము లటులనే యున్నవి. అవి యీనారాయణభట్టుకవిత్వములోనివై యుండనోవును. అటుగాకున్న నన్నయభట్టారకుఁ డీతనివిషయ మై చేసినస్తోత్రముంబట్టి మంచిశైలితో నుండినపద్యములే అతనివై సామాన్యశైలితో నుండునవియే నన్నయభట్టుకవిత్వములోనివి కానోవును. అటుగాకున్న రామాయణ మాంధీకరించుకవులు కొన్ని కాండములొకరును మఱికొన్ని కాండములు మఱికొందఱును పంచుకొని రచియించి నట్లు నిర్ణయించి గ్రంథము వ్రాయుచు నది ముగియకమునుపే నన్న యభట్టునకుం గల్గినమనోవైకల్యముంబట్టి యాగ్రంథమంతయు యథా యథలై పోఁగా నాయుద్యమ మంతటితో ముగియఁగా నదివఱకు సిద్ధమైనగ్రంథము నన్నయభట్టారకునిపేరిటనే ప్రకటింపఁబడి యుండనోవునుఁ అటుగానిచో నారాయణభట్టుపేరుమట్టుకు వ్రాయఁబడి పిమ్మట నతనివలనఁ జేయంబడినసహాయము వివరింపఁబడక యుండునా ? అట్లుండదు. ఉన్నను లేకున్నను మన మావిషయంగూర్చి చర్చించిన లాభ మేమి ? కావున దానిని వదలుదము.

భారతాంధ్రీకరణము.

ఈకథ సంప్రదాయజ్ఞ మతానుసారముగ వ్రాయంబడును. ఎట్లన్నను : - వేఁగిదేశములోని రాజమహేంద్రవరపురీ రాజమహేంద్రుం డగురాజరాజనరేంద్రుఁడు ఆంధ్రదేశములోనివేఁగినాడు (ప్రస్తుతపుగోదావరిజిల్లా) ను బాలించుచుండెను. అతఁ డొకదినంబునఁ బొడమినకుతుకంబున నిజనభాభ్యంతరంబున కేతెంచి పండితశిరోమణులం గాంచి భారతామ్నాయంబుఁ దెనుఁగున భాషాంతరీకరణం బొనర్పఁ దగువార లేవార లనిన సభ్యులందఱును వాగనుశాసనుం డగునన్న యభట్టారకుండుదక్క నట్టిమహత్తరకార్యంబున కొరులు చాల రనిన నారాజశిఖామణి యగుఁగాక యనియెను. ఇట్లని వాగనుశాసనుం బిల్చి పూజించి కర్పూరతాంబూలకనకచేలంబు లిచ్చి మీ రీమహనీయకార్యమునకు నియ్యకొనుం డని పల్కెను. పల్కిన నన్నయ యత్యానందంబునఁ