పుట:Kavijeevithamulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

కవి జీవితములు



"బంచమవేదం బగుభారతంబును దెనిఁగింపఁ గంటిని ధన్యుండ నైతి" నని యెంచి రాజుం గాంచి యట్లనే కావించెద నని దానిఁ దెనిఁగింప నుపక్రమించెను.

అథర్వణాచార్యుఁడు.

ఇటుల నారంభించి తొలుత నాదిపర్వంబును బిమ్మట సభాపర్వంబును దెనిఁగించెను. ఆరణ్యపర్వంబు రచియించుతఱి నధర్వణాచార్యుం డనునొకపండితో త్తముఁడు తాను భారతముఁ దెనిఁగించి విష్ణువర్ధనునకుఁ గృతి యిచ్చుటకు వచ్చి తత్సంస్థానపండితుం డగునన్న పార్యుం జూడఁ జనుదెంచెను. వచ్చి తనరాక నెఱిగించిన నాతఁడు తానును భారతమును దెనిఁగించుచుంటం జేసి యాతనికవిత్వ మెట్లున్నదో చూతమని యతనిభారతంబున నొకపద్యంబుఁ జదువు మనుడు నాతఁడును నట్ల కావించెను. అంతట నన్నయ యాతనిసంగ్రహనైపుణికి మిగుల నచ్చెరువంది తనమనంబున నిట్లు చింతించె. "ఈతనిభారతంబు మన రాజు చూచెనేని మిగుల సంతసించును. ఇంతటితో మద్గ్రంధంబు పరిసమాప్తి నొందును. అట్లైన నాగౌరవంబు కొంచె మవును. ఏదియేని యొకయంకిలి గావించి రాజు దీనిం జూడకుండునట్లు చేయవలెను. ఈసమయములో నీతఁడు దొలంగినఁ గొంత మేలగును. మఱల నీతఁడు వచ్చు నంతకు నేఁ జేయుభారతము పూర్ణంబు సేసి రాజునకుఁ జూపెదను" అని యూహించి యాపండితుం గాంచి యెల్లి రాజదర్శనంబున కరుగుదము. నేఁడు విడిదలకుఁ జనుం డని యాతనిం బనిచి యాతఁడు విడిసినయింటివారల రావించి వారలకుఁ గొంతధన మొసంగిన వారలు "దేవరయాజ్ఞ సేసెదము. కర్తవ్యంబు సెలవిం డనుడు వారల కాతఁ డిట్లనియె. "రేపటిదినం బాకవి యింట లేనిసమయంబున మీయింటికిఁ జిచ్చిడుఁడు. దానిచే నతనిపొత్తంబులు సెడును." అనిన వారలు సమ్మతించిరి. తా నామఱునాఁ డాపండితునికడకుం జని యాతనిఁ దోడ్కొని రాజమందిరద్వారంబు చేరెను. అచ్చట వీరిరువురును ముచ్చటలాడు