పుట:Kavijeevithamulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

కవి జీవితములు

శ్రీనాథకవియు నన్నయభట్టు నీక్రిందివాక్యంబున భీమఖండంబున నుతియించెను. ఎట్లన్నను :-

"క. నెట్టుకొని కొలుతు నన్నయ, భట్టోపాధ్యాయసార్వభౌమునిఁ గవితా
    పట్టాభిషిక్తు భారత, ఘట్టోల్లంఘనపటిష్ఠగాఢ ప్రతిభున్."

ఇటులనే ఆంధ్రకవు లందఱును నన్నయభట్టును నుతియించిరి.

నన్నయభట్టారకుని గ్రంథరచనాప్రతిజ్ఞ.

నన్నయ తాను రచియింపఁబోవుగ్రంథమున నీక్రిందివిధమున శపథంబుఁ జేసెను :-

"ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తితో
     నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా
     నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెలుంగున న్మహా
     భారతసం హితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్."

సహాయుఁ డగునారాయణభట్టు.

అని చెప్పి తాఁ జేయ దొరఁకొనినపైగ్రంథరచనలోఁ దనకు సహాయుఁడుగాఁ దగిననారాయణభట్టునుగూడఁ జేర్చుకొని గ్రంథరచనకు గడఁగెద నని చెప్పెను. ఎట్లన్నను :-

ఉ. పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా
    రాయణుఁ డట్లు తానును ధరామరవంశవిభూషణుండు నా
    రాయణభట్టు వాఙ్మయధురంధరుఁడున్ దన కిష్టుఁడున్ సహా
    ధ్యాయుఁడు వైనవాఁ డభిమతంబుగఁ దో డయి నిర్వహింపఁగన్".

దీనింబట్టి నన్నయభట్టారకునితోపాటుగ నారాయణభట్టారకుఁడును మనయాంధ్రభాషాభ్యాసకులను నాధార మైనభారతగ్రంథములోని మొదటిమూఁడు పర్వములలోను నన్నయ యెఱ్ఱాప్రగ్గడలవలె ముఖ్యుఁడైనాఁడు. కాని యితనిచేత రచియింపఁబడినభాగము లివి యని తెలియకపోవుటచేతను, అతనికవిత్వ మెట్లున్నదో చెప్పఁజాలము. కాని మొదటిమూఁడుపర్వములోనిదినన్నయభట్టుకవిత్వమా ? అని సంశయింపఁ దగినకొన్నిపద్యములు సామాన్యశైలితో నున్నవి కానుపించును.