పుట:Kavijeevithamulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

53

"చ. అమలినతారకాసముదయంబుల నెన్నను సర్వవేదశా
     స్త్రములయశేషపారము ముదంబునఁ బొందను బుద్ధిబాహువి
     క్రమమున దుర్గమార్థజలగౌరవభారతవాహినీసము
     ద్రముఁ దఱియంగ నీఁదను విధాతృనకైనను నేరఁబోలునే."

అని నన్నయభట్టారకుఁడు తనలో నూహించుకొని ప్రభువు కోరినకార్యము నెఱవేఱ్చుట విధి యని నిశ్చయించుకొని ప్రభువు నుద్దేశించి నీయనుమతంబున విద్వజ్జనంబులయనుగ్రహంబునం జేసి నా నేర్చువిధంబున నిక్కావ్యము రచియించెద నని యిష్ట దేవతా వందనం బొనర్చి సంస్కృతకవు లగువాల్మీకి వ్యాసాదుల నుతియించి తక్కినపండితసమాజము నీక్రిందివిధంబున నుతియించెను. ఎట్లనఁగా :-

"చ. పరమవివేక సౌరభవిభాసితసద్గుణపుంజవారిజో
    త్కరరుచిరంబు లై సకలగమ్యసుతీర్థము లై మహామనో
    హరసుచరిత్రపావనపయఃపరిపూర్ణము లైనసత్సభాం
    తరసరసీవనంబుల ముదం బొనరన్ గొనియాడి వేడుకన్."

ఇంతియ కాని యీకవి తనకుఁ బూర్వు లగునాంధ్రకవుల నుతించియుండలేదు. అంతమాత్రముచేత నతనికిఁ బూర్వు లగునాంధ్రకవులు లేరని చెప్పఁగూడదు. పెక్కండ్రు ప్రసిద్ధాంధ్రకవులు గలరు. ఉన్నను వారిని నుతియింపక యుండుట యే ఆకాలపుఁగవులయాచారముగాఁ దోఁచెడిని. భీమకవి గాని, భాస్కరకవి గాని, తిక్కనసోమయాజి గాని తమకుఁ బూర్వు లగునాంధ్రకవుల నుతించినట్టు కానుపించదు. కాని ఎఱ్ఱాప్రగ్గడనుండి యీపద్ధతి మాఱుపఁబడినది. అతఁ డైనను నన్నయభట్టారకుని, తిక్కనసోమయాజినిమాత్రము హరివంశములో నుతియించెను. అందు నన్నయభట్టు నీక్రిందివిధంబుగఁబేర్కొనియెను. ఎట్లన్నను :-

"ఉ. ఉన్నతగోత్రసంభవము నూర్జితసత్త్వము భద్రజాతిసం
     పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్కటమున్ నరేంద్రపూ
     జోన్న యనోచితంబు నయి యొప్పెడునన్న యభట్టకుంజరం
     బెన్న నిరంకుశోక్తిగతి నెంతయుఁ గ్రాలుటఁ బ్రస్తుతించెదన్."