పుట:Kavijeevithamulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

కవి జీవితములు

"గీ. ప్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖండ మనుమహాగ్రంథ మేను
    దెనుఁగు జేసెదఁ గర్నాటదేశకటక, పద్మవన హేళి శ్రీనాథభట్టసుకవి."
                                             శ్రీనాథుని కాశీఖండము.

అనియున్న దికాని యీశ్రీనాథుఁడు నియోగియే యగునా? అని యూహింపఁగా నాగ్రంథాంతములోని యాశ్వాసాంతగద్యము పైసందేహమును నివారించును. ఎట్లన్నను :-

"ఇది కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీనాథనామధేయ ప్రణీతము" అనియున్నది. కావున నీతఁడును నియోగిబ్రాహ్మణుఁ డనియే నిశ్చయమగుచున్నది గదా. దీనింబట్టి శ్రీనాథునికాలమువఱకును నియోగులు వైదికవృత్తిలో నున్న వా రమాత్యాదినియోగబిరుదావళులం గైకొనక యున్నట్లును, లౌకిక వ్యాపారములోఁ దిరుగువారుమాత్రమే అమత్యాదిశబ్దముల గ్రహించుచున్నట్లును గానుపించును. దీనింబట్టియే శ్రీనాథుఁడు తనతాతపేరు వ్రాయుచు "కమలనాభతనూభవ" అనిమాత్రమే వ్రాసెను. ఈకమలనాభుఁ డొక గొప్పయాంధ్రకవి. అయినను లౌకికవృత్తిలో లేఁడు గావున నమాత్య శబ్ద ముంచి చెప్ప లేదు. ఇంతియకాక 'నన్నయ' "తిక్కయ" అనునామములుగూడ మహారాష్ట్రభాషాసాంకర్యము గల వని చెప్పుటచేఁ బైని మనము చేసినయూహలు మఱియును బలపడునవియై యున్నవి.

నన్నయభట్టు భారతమును దెనిఁగించుట.

పైసీసపద్యములో వివరించినప్రకారము రాజనరేంద్రుఁడు నన్నయభట్టును సగౌరవంబుగాఁ జూచి యీక్రిందివిధంబుగఁ జెప్పెను. ఎట్లన్నను :-

"క. జననుతకృష్ణ ద్వైపా, యనమునివృషభాభిహితమహాభారతబ
    ద్ధనిరూపితార్థ మేర్పడఁ, దెనుఁగున రచియింపు మధికధీయుక్తి మెయిన్."

అని యానతిచ్చిన నన్నయ తనలో నిట్టుగా యోజించెను. అదెట్లన్నను :-