పుట:Kavijeevithamulu.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

582

కవి జీవితములు.

బెద్దనకవిత్వమునకుఁ గల్గినలోపమును నివారించుటకుఁగాను కుందవరపు కవిచవుడప్ప యనునతనిగ్రంథములోనుండి యొకపద్యము నెత్తి వ్రాసి దానిని నిర్దుష్టము చేసెదను. అది యెద్ది యనగా :-

క. పెద్దనవలెఁ గృతి సెప్పినఁ, బెద్దనవలె నల్పకవినిఁ బెద్దనవలెనా
    యె ద్దనవలె మొ ద్దనవలె, గ్ర ద్దనవలెఁ గుందవరపుకవిచౌడప్పా.

అని యున్నది. ఇట్టి పెద్దనకుం గూడఁ దప్పు లున్నట్లు చెప్పువారి పెద్దఱిక మడుగనేల?

పూ. 7. ఆముక్తమాల్యదలోపలను, మనుచరిత్రంబులోను వంశావళీ పద్యములును, మఱికొన్ని పద్యములును, ఒక్కటిగా నుండుటకుఁ గారణంబు 3 (a) పద్యంబు యథార్థమైనచో రాయలయెడ గౌరవముఁజూపుటకు నాముక్తమాల్యదనుండి పెద్దన మనుచరిత్రమునకుఁ జేకొని వ్రాసియుండవలయును. లేక మనుచరిత్రమే ముం దైనచో నాముక్తమాల్యదాకారుఁ డాగ్రంథములలో వానిం జేకొని యుండవలెను.

సమా. 7. దీనిలో మనుచరిత్రము నాముక్తమాల్యద అనుగ్రంథద్వయ మొకరి కృతమే అని నిశ్చయించుకొని మొదటిదే ముందుగ రచియింపఁబడిన దానిలోనివానిఁ గైకొనుట గాక సమాధానమును, రెండవదియే ముందుగ రచియింపఁబడిన దానిలోనిపద్యములు మొదటిదానికి వచ్చుటకుఁ గారణములును జెప్పంబడినవి. కాని ఆగ్రంథకర్త లుభయులు వేర్వేఱైనచో నెట్లు చెప్పవలయునో ఆసమాధానములు వ్రాయంబడ వాయెను. కావున మన మిపు డీరెండవ ఫక్కికనుబట్టి యూహింపఁగ మనుచరిత్రములోఁ బెద్దనవలన రచియింపఁబడినకృష్ణరాయ వంశావళినే ఆముక్తమాల్యదలోఁ గృష్ణరాయనివలన దనవంశానువర్ణనము స్వకృతముగాక అన్యకృత మని తెలియఁజేయుటకుఁ గైకొనంబడె నని యూహింపవలసియుండును. స్వవంశవర్ణనయే గాక ఆముక్తమాల్యదలోఁ గృష్ణరాయనివలన స్వవర్ణనముగూడఁ జేయఁబడినది. అట్టివర్ణనఁ గృష్ణరాయఁడు స్వయముగఁ జేసికొనఁగమకింపఁడు కావున నన్యకవిరచితమునే అం దుంచఁగోరు ననునది యెంతయు యుక్తియుక్త మగును.