పుట:Kavijeevithamulu.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

565

దోఁచును. అటులైన నీస్ఖాలిత్యంబు లుంటకుం గారణంబు లేదు. మొదటి దాని కే యెక్కుడు గల్గియుండు ననినఁ జెప్పనేల. ఇట్టి భేదంబులంబట్టిచూడ నిది పెద్దనకృతంబు గా దని స్పష్టంబుగ దోఁచెడిని. దీనియందు మనుచరిత్రంబులోని పద లాలిత్యంబును లేదు. రసపుష్టియు నంతమాత్రంబ. అటు లనినచో దీనికవి కివి యేమియుం దెలియవు గాఁబోలు నని యూహింపఁగూడదు. ఇట్లుండుటకుఁ గారణంబు లుండనోవు. కృష్ణరాయండు పెద్దన మొదలగు కవులరీతిని గురుశుశ్రూష చేసి శ్రమకోర్చి చదువు నభ్యసించి యున్న వాఁడు కాకపోవచ్చు. అయిన నెల్లపుడుఁ బండిత గోష్ఠి నుండువాఁడు గావున ముందు శ్రుతపాండిత్యంబు విశేషంబుగ సంపాదించి పిమ్మట శాస్త్రసంప్రదాయంబులు నేర్చి బుద్ధిమంతుండుగావున కవి యై గ్రంథముల రచియించి యుండు. విద్యలఁ గ్రమశిక్షితుండు గాఁ డనుట కీతనిపదలాలిత్యంబే దృష్టాంతంబు. ఇష్టానుసారంబుగఁ బ్రయోగించిన పదంబు లవుటం జేసి యవి యొకచో నిర్ణీ తార్థంబుకంటె నధికంబుగ వేఱొకచో న్యూనంబుగ నుండిత్వరలో భావద్యోతకంబులు గావు. ఇట్టి చిక్కులు పెద్దన మొదలగు వారి గ్రంథంబులఁ గానరావు. శబ్దంబుల నర్థకాఠిన్య మున్నను, భావకాఠిన్య మింతగా నెందును గానరాదు. ఈ పైఁజెప్పిన హేతువులనుబట్టి యూహింప నీగ్రంథంబు విశిష్టాద్వైతిచేతను సహజపాండిత్యునిచేతను రచియింపఁబడినట్లు గాన్పించెడిని. కృష్ణరాయలయం దీధర్మంబు లన్నియుఁ గాన్పించుటచేత నాతఁడే దీని రచించినాఁ డని నిశ్చయింపఁ దగియున్నది. ఈతఁ డచ్చటచ్చట నాశ్వాసాంతములఁ జెప్పిన పద్యంబులును మననిశ్చయమున కెంతయు బలము నిచ్చు చున్నవి. అం దొక దాని నిట వివరింతము.

మ. ఇది భూమండన కొండవీటిధరణీ భృద్దుర్గపూర్వాద్రిభా
      స్వదిభేశాత్మజవీరభద్రజనజీవగ్రాహరాహూయమా
      ణదృఢాంచద్భుజకృష్ణరాయమహిరాణ్ణామాస్మదాముక్తమా
      ల్యద నాశ్వాసము గద్యపద్యము ద్వితీయం బై మహిం బొల్పగున్.

ఇట్టిపద్యంబులంబట్టి మనకు సంశయంబుతోఁ బనిలేదు.