పుట:Kavijeevithamulu.pdf/477

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
471
సంకుసాల నృసింహకవి.

కవిత్వవిషయము.

ఇఁక నాంధ్రకవులచరిత్రములోని యింకొకయాక్షేపణకు సమాధానము చెప్పక తీఱదు. అందులో

"కవివర్ణ రసాయనము మొత్తము మీఁద మంచిదే అయినను, పెద్దనార్య కృత మయిన మనుచరిత్రకంటె నే విషయమునందును గుణాతిశయము కలది కాదు."

అనియున్నది. దీనికి సమాధానము మిక్కిలి శ్రమలేకయే అచ్చటచ్చటనుండు సమానాంశములలోనివర్ణనలు సూపినం జాలియుండును. ప్రస్తుత మీయుభయుల కవిత్వశయ్యాదులం గూర్చి చూపందలఁచు కొని యున్నాఁడను గనుక దీనిలోనే పైరెండువిషయములుగూడ చూడఁదగును. అంతవఱకును పెద్దనకంటె నృసింహకవి గుణాథికుఁ డని కానీ లేక నృసింహకవికంటెఁ బెద్దన గుణాధికుఁడనికానీఁ నిర్ణయింపక యుంచెదను.

పురవర్ణనము.

"మ. వరణాద్వీపవతీతటాంచలమునన్ వప్రస్థలీచుంబితాం
       బర మై సౌధసుధాప్రభాథవళితప్రాలేయరుఙ్మండలీ
       హరిణం బై యరుణా స్పదం బనఁగ నార్యావర్తదేశంబునం
       బుర మొప్పున్ మహికంఠహారతరళస్ఫూర్తి న్విడంబించుచున్." మను

"సీ. జాతరూపమనోజ్ఞజాతరూపం బైన, కోటచే వలయాద్రి నోటుపఱిచి
      మధుసుధారసపూరమధురనీరం బైన, పరిఘచే వారాసి భంగపఱిచి
      నవరత్న చిత్రాభినవయత్న కములైన, యిండ్లచేఁ గనకాద్రి యేపుగఱచి
      కాంతనిర్మలచంద్రకాంతబద్ధము లైన, కుట్టిమంబుల ధాత్రి కొంచెపఱిచి
      కమలగర్భుండు తన సృష్టి గాఁ ద్రిభువన, కోశగర్వంబు నడఁగించుకొలఁది దీని
      వేడ్క నిర్మించె ననఁ బొల్పు విమతహృదయ, ఘట్టణం బైనసాకేతపట్టణంబు."
                                                                                      కవిక. ర.

మనుచరిత్రములో నల్లసానిపెద్దన పురవర్ణన తోఁ గల్పిబ్రహ్మ క్షత్త్రవణిక్ఛూద్రులను వెలయాండ్రను ఒక సీసపద్యమున వర్ణించెను. ఆపద్యమెట్లన్నను :-

సీ. అచటివిప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి, ముది మదిదప్పిన మొదటివేల్పు
    నచటిరాజులు బంటు నంపి భార్గవు నైన, బింకానఁ బిలిపింతు రంకమునకు