పుట:Kavijeevithamulu.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

470

కవి జీవితములు.

"గీ. యతి విటుఁడు కాకపోవునే యస్మదీయ, కావ్యశృంగారవర్ణనాకర్ణనమున
     విటుడు యతి కాక పోవునే వెస మదీయ, కావ్యవైరాగ్యవర్ణనాకరణనమున."

ఇ ట్లున్నదానికి నాంధ్రకవుల చారిత్రములో వ్రాయంబడిన యీక్రిందివాక్యము లనాలోచితము లని చెప్పవలసియున్నది. అవి యెట్లన్నను :-

"ఆనృసింహకవి తనకవిత్వసామర్థ్యముం గూర్చి గ్రంథాదియం దాత్మస్తుతిఁ జేసుకొనియున్నాఁడు, మఱియుఁ దక్కిన కవులవలెఁ గాక కుకవిధూషణముం బెక్కు పద్యంబులం జేసియున్నాఁడు. కాఁబట్టి యితఁడు స్వాతిశయభావము గలవాఁడై నట్లు కన్పట్టుచున్నాఁడు."

అని యున్నది. ఈవిషయములోఁ బెద్దనకవి యింతకంటె శ్లాఘాపాత్రుఁ డగు నని చెప్పవచ్చునేమో ఆసంగతి పెద్దనగ్రంథంబునుండి వెదకి చూతము. అందులోఁ గుకవినంద యున్నది. ఎట్లనఁగా :-

"మ. భర మై తోఁచుకుటుంబరక్షణకుఁగా బ్రాల్మాలి చింతన్ నిరం
       తరతాళీదళ సంపుటప్రకరకాంతారంబునం దర్థపుం
       దెరవాటుల్ తెగి కొట్టి తజ్జ్ఞపరిష ద్విజ్ఞాతచౌర్యక్రియా
       విరసుం డై కొఱతం బడుం గుకవి పృథ్వీభృత్సమీపక్షితిన్."

       స్వప్రజ్ఞాప్రకటనముంగూడ నీక్రిందివిధంబునఁ జేసికొనియె.

"క. హితుఁడవు చతురవచోనిధి, వతులపురాణాగమేతిహాసకథార్థ
      స్మృతియుతుఁడ వాంధ్రకవితా, పితామహుఁడ వెవ్వ రీడు పేర్కొన నీకున్."

ఈపద్యము కృతిపతి చెప్పిన ట్లుండుటంజేసి అది పెద్దనార్యుని కవిత్వము కా దనిగానీ యది యాత్మస్తుతి కా దనిగానీ చెప్పవలనుపడునా? ఇంతియకాక ఆశ్వాసాంత గద్యములో నున్న వాక్యంబు లాత్మస్తుతిని దెల్పునవి కాకపోవునా ఆగద్య మెట్లున్న దన :-

"ఇది శ్రీమదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీనమానవేందిందిర నందవరపు వంశోత్తంస శఠగోపతాపసప్రసాదాసాదిత చతుర్విధకవితామ తల్లికాల్లసానిచొక్కయమాత్య పుత్త్ర పెద్దనార్యప్రణీతము"

అని యున్నది. నృసింహకవి పెద్దనార్యునివలె నాత్మస్తుతి అతిమాత్రముగఁ జేసి యుండలేదే. ఇట్లుండఁ బెద్దనకంటె నధికముగ నరసింహకవి నిందాపాత్రుఁ డని చెప్పుట సహేతుకము కా దనిచెప్పవలయును.