పుట:Kavijeevithamulu.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

405

ఆపద్యము లుదాహరించుతఱి నావృత్తాంత మంతయు వివరించెదను. కావున నిపు డాకథ వదిలి లక్ష్మణకవి క్రీ. శ. 1770 సం. మొదలు క్రీ. శ. 1840 సం సంవత్సరమువఱకు జీవించియున్నట్లు నిశ్చయించెదను.

గ్రంథరచనాకారణము.

దీనింగూర్చి గ్రంథకర్తయే కొన్ని కారణములు వివరించె. అవి నమ్మఁదగిన వైనను కాకున్నను వానిని వివరించుట మంచిదికావున వివరించెదను. ఎట్లన గాఁ దన కొకనాఁడు స్వప్నం బయ్యె ననియును, అపు డాస్వప్నంబునఁ దనతండ్రి యగుగోపాలమంత్రి తనకుఁ గనుపించి తాను కావించుభక్తిపూర్వకనమస్కారంబు లంగీకరించి తన్నుంగూర్చి యీక్రింది వృత్తాంతమును గ్రంథము చేయు మని ఆజ్ఞాపించెనఁట. అదెట్లనఁగా :-

"సీ. 'ఆరెవెట్టం' బన్న యూర నుండెడు రావు, బుచ్చయ్య నరసమపుత్త్రకుండు
      దమ్మనరా వన ధర్మరాయం డన, నిరుపేళ్లతోడుత నెసఁగువెలమ
      యరయ భద్రయ్య, జగ్గయ్య, తమ్మయ్య, భా,వయ్య లన్నలుగురి కగ్రజుండు
      పుత్త్రాదిసంపత్తిఁ బొసఁగునతఁడు మన, కుయ్యేరు ప్రీతితో గుత్తసేసి

గీ. నీదులంకమాన్యము బల్మినిహరించెఁ, గానతత్ప్రాప్తికై రాముకథయు మనక
    థయును జతగాఁగ నర్థంబు ఘటనపఱిచి, కృతి రచించి గోపాలున కిమ్ము తనయ"

అని యున్నది.

ఇట్లు పల్కి పిమ్మట నీలక్ష్మణకవినే తనకవిత్వ మీక్రిందివిధంబుగ నుండవలె నని చెప్పినట్లు చెప్పె. ఎట్లన్నను :-

ఉ. కొందఱు శబ్దసౌష్ఠవముఁ గొందఱు భావముఁ గొంద ఱర్థమున్
    గొందఱు సంధిసంఘటనఁ గొంద ఱలంకృతి వృత్తిఁ గొందఱున్
    గొందఱు దెన్గు సంస్కృతముఁ గొందఱు ఛందముఁ గొంద ఱన్నియున్
    గొందఱు జూతు రెల్ల కవికోటి భళీ యనఁ జేయుమీ కృతిన్.

అని తాఁ జేయంబోవుగ్రంథములోఁ బైవిశేషము లుండవలయు నని చెప్పినట్లున్నది. అంతియకాక తాఁ జేయఁబోవుగ్రంథమునకుఁ దా నుంచుకొనవలసినపేళ్లుగూడఁ దనతండ్రిచేతనే నిర్ణయించఁబడి నట్లు చెప్పియున్నాఁడు. అవి యెట్లన్నను :-