పుట:Kavijeevithamulu.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

404

కవి జీవితములు.

గ్రంథరచనాకాలవివరము.

ఈవిషయమై గ్రంథములో కవివలనే యొకవచనము వ్రాయంబడెఁగావున దాని నీక్రింద వివరించెదను. అందులో నీలక్ష్మణకవి గ్రంథరచనాకాలముం దెల్పియున్నాఁడుగావున దానింబట్టి యించుమించుగా నీకవిజననకాలముంగూడ నూహింపవచ్చును. ఆవచన మెట్లున్నదనఁగా :-

"వ. అని యిష్టదేవతా వందనంబును, నవగ్రహ ధ్యానంబును, మద్గురుసేవనంబును, సుకవిజనస్తుతియును, కుకవిప్రతారణంబును, మజ్జననస్థలంబై నకుయ్యేరు పురవర్ణనంబును, మద్వంశసూచనంబును, గావించి, యే నొకప్రబంధంబు నవరసభావార్థలక్షణానుబంధంబుగా నూహించి కల్యబ్దములు 4896 శాలివాహనశకాబ్దములు 1719 ఇంగ్లీషు సంవత్సరములు 1797 (A. D. 1797) ఫసలీ 1207) 1207 అగు పింగళ సంవత్సర శ్రావణమాసములో రచియింప నుద్యోగించియున్న సమయంబున"

అని యున్నది.

దీనింబట్టి చూడ నీలక్ష్మణకవి యీగ్రంథమును రచియించిన కాలము శాలివాహన సంవత్సరముయొక్క పదునెనిమిదవ శతాబ్ద ప్రారంభమం దని తేలుచున్నది. అప్పటి కతఁ డేఁబదిసంవత్సరముల వయసువాఁడే అయ్యె నేని అతని జననకాలము శా. స. 1660 సమీపకాలమై యుండును. కాఁబట్టి యీకవి శాలివాహన శతాబ్దముయొక్క పదునేడవ శతాబ్దమధ్యము మొదలు పదు నెనిమిదవశతాబ్దముయొక్క మధ్యము దనుక నున్న ట్లూహింపనై యున్నది. ఇదివఱలో నీచరిత్రాదిలో నీలక్ష్మణకవి నైఘంటికుఁ డగు సి. పి. బ్రౌన్ (Mr. C. P. Brown.) దొరకాలీనుఁ డని చెప్పియుంటింగావున నాదొరకాలమువఱకు నీకవి జీవించి యుండె నని చెప్పవలసియున్నది. ఆకాలమునాఁటి కీ కవి మిక్కిలి ముదుసలివాఁ డై యుండనోవును. అ ట్లుండియు లక్ష్మణకవి పై బ్రౌనుదొర రాజమహేంద్రవరము జిల్లాకోర్టులోనో లేక బందరుప్రొవిన్షియల్ కోర్టులోనో సివిల్ జడ్జీగా పనిచేయుచున్నపుడు తనమేనల్లునివిషయమై పద్యరూపక మగునొకవిజ్ఞాపన పత్త్రము వ్రాసి పంపినట్లు వాడుక గలదు.