పుట:Kavijeevithamulu.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

391

జుట్టఱికంబునం, బొగడఁ జూచితినా రజతాద్ర్యధిత్యకా
పట్టణమధ్యరంగగతభవ్యవధూవద నానుషంగ సం
ఘట్టశిరస్థ్స గాంగఝరహల్లకజాలసుధాతరంగముల్
చుట్టుకొన న్వలెన్ భువనచోద్యరుఁగా భయదంబుగా మఱిం
దిట్టితినా సభాభవనధీంకృతభీమనృసింహరాడ్ధ్వజా
తాట్టమహాట్టహాసచతురాస్య సముద్భృకుటీతటీవటీ
కోట్టణరోషజాలహృతకుంఠితకంఠగభీరనాదసం
ఘట్టవిజృంభమాణగతిఁ గావలె దీవనపద్య మిచ్చి చే
పట్టితినా మణీకనకభాజనభూషణభాసురాంబరా
రట్టతురంగగంధగజరాజదమూల్యఘనాతపత్రభూ
పట్టణభర్మ హర్మ్యభటపంక్తి చిరాయు వనామయంబు వై
గట్టిగ తోడుతో వెలయఁగావలె నెక్కువఠీవిఁ జూడుఁడీ
యట్టిటు మందెమేలముల నందఱినింబలెఁ జుల్కఁ జూచి యే
పట్టుననైన కేరడము పల్కకుఁడీ పయివచ్చు నందులన్
గొట్టుచు దుష్కవిద్విరదకోటుల బంచముఖోద్భటాకృతిం
బెట్టుదు దండముల్ సుకవిబృందము కే నతిభక్తి సారెకున్
గట్టితి ముల్లె లేఁబదియుఁ గాఁగలనూటపదాఱు లెయ్యెడన్
రట్టడి భట్టుమూర్తికవిరాయనిమార్గ మెఱుంగఁ జెప్పితిన్.

అని యాగ్రహించిన రాయ లీబ్రాహ్మణు లొనరించు నీదురాలోచన నే నెఱుంగ. నీయాన. నన్నేల తిట్టెద వని యనర్ఘ్యబహుమానం బొనర్చి గాఢాలింగనంబు గావించిన సంతసించుచు భట్టుమూర్తి రాయలమీదఁ జెప్పినపద్యము.

ప. ఆబ్జముఖీమనోజ నరపాధిపనందన కృష్ణ నీయశం
    బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీపరాక్రమం
    బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీవితీర్ణిమం
    బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము చిత్ర మిద్ధరన్. [1]

  1. ఈపద్యము పంచపాషాణము లని ప్రసిద్ధిం జెందినయైదుపద్యములలో నొక్కటి. దీనికిని తక్కిననాల్గింటికిని వ్యాఖ్యానమున్నచోఁ బాఠకుల కుపయుక్త మని యీచరిత్రాంతమందు వానివ్యాఖ్యం బ్రకటించెదను. తక్కినవి నాల్గుపద్యములుకూడ మూర్తికవి వని యూహింపఁగూడదు. వానికవులు ప్రత్యేకముగా నున్నారు అపద్యము లిదివఱలో నొక్కటి కొఱఁత గాఁ దక్కినవాని నుదాహరించియే యున్నారు.