పుట:Kavijeevithamulu.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

390

కవి జీవితములు

నాయని యూహించుచుండఁ బెద్దన్న, రామలింగము మొదలగువారును తాము రాజాస్థానమున దిగువం గూర్చిండియుండ, మూర్తికవి రాజుతో నర్ధసింహాసనారూఢుం డై యుండు నని యెంతయు చింతచేఁ గుందుచు నొకసమయమున నీతిని కెఱిఁగింప నతఁడును మీర లూరక యుందురు. ఏ నేమిసేతు. మీర లాతనిఁ గ్రిందికి డించుయత్నంబు జేసిన నేనును సహాయభూతుండ నయ్యెదనని వక్కాణించను. ఇటులుండ నొక్కనాఁడు రాయల సంభాషణంబున రామలింగము వారింగూర్చి యొకపద్య మిటుల జెప్పెనుః

క. నరసింహకృష్ణరాయని, కర మరు దగుకీర్తి వెలసె కరిభిద్గిరిభి
    త్కరికరిభిగ్గిరిగిరిభిత్కరిభి, ద్గిరిభిత్తురంగక మనీయం బైః

అని చెప్ప నందఱు నానందింప భట్టుమూర్తి యూరకుండిన, నేమి యూరకుండి తీ వీపద్యం బెటులుండె ననవుడు నందఱకుం బాగుగా నుండ నాకుం బాగుగాదే యనఁ దిమ్మర సిది యేమో శ్లేషగాఁ బలుక నోవు నన రామలింగ మిది బాగుండ కుండిన నింతకుబాగుగా నీవు జెప్పిన నాసింహాసనంబునం గూర్చుండుము. లేనియెడ దిగు మనఁదిమ్మరసు ఔను రామలింగముమాట బాగుగా నుండె నన నపుడు భట్టుమూర్తి యాగ్రహించి నన్ను సింహాసనంబు దిగు మని తిమ్మరసు పలుకుంగాన యిదిగో తిమ్మరసును నిన్నుగూడఁ దిట్టెద నని వక్కాణించుచుఁ రాయలంగూర్చి జెప్పినపద్యము :-

ఉ. లొట్ట యిదేటిమాట పెనులోభులతో మొగమాట మేల తాఁ
    గుట్టకయున్న వృశ్చికముఁ గుమ్మరపు ర్వని యందురే కదా
    పట్టపురాజుపట్టిసరిపల్లె సరాసరి యియ్యకున్న నేఁ
    దిట్టకమాన నామతము తీవ్రమహోగ్రభయంకరంబుగాఁ
    దిట్టితినా మహాగ్రహమతిన్ మకరగ్రహజర్జరీభటా
    పట్టపుదట్టఫాలఫణిభర్తృజహూకృతపర్జటస్ఫుటా
    ఘట్టనథట్టణాలకవి ఘట్టకనిర్గళ రాజభృత్యకీ
    చట్టచటార్భటీనయనజర్జరకీలలు రాలఁగావలెన్