పుట:Kavijeevithamulu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

371

ర్పఱుపంబడలేదు. ఇట్లుండ పైమూర్తు లిర్వురియొక్కయు వర్గత్రయమును, వంశసాంప్రదాయములు తెలియక యొకరిపిల్లల నొకరి కిప్పించి సంబంధ బాంధవ్యములు జరిపినట్లు చెప్పియుండలేదు. కావున కట్టుకథలనువానికిని శాస్త్రీయవిమర్శనకుం గలభేదము ముందుగఁ దెలిసికొననిదే యీచారిత్రములు వ్రాయ గమకింపఁగూడ దని విన్న వించెదను.

రామభూషణునిసంగీతప్రజ్ఞ.

దీనిం దెల్పునట్టి "సంగీతకళారహస్యనిధి" యనుబిరుద మీకవికున్న ట్లిదివఱకే చెప్పియున్నాము. ఇపు డట్టిబిరుదు గల్గుటకు కారణము జెప్పవలసియున్నది. ఇది కేవలము గ్రంథస్థ మగుగాథ కాకున్నను దేశమందు సంప్రదాయజులవలన వినియున్నదియు నట్టివని సమర్థులవలనఁగాని కాని దగుటంజేసియు సంగీతరహస్యకళానిధి నని రామభూషణుఁడు స్వస్వరూపప్రకటన తానే చేసుకొని యుండుటంబట్టియు నట్టిమాటను వక్కాణించుటకు నీసంప్రదాయము సాక్ష్యముగా నగుచుండుటవలన దాని నిట వివరించెదను. దానిని బలపఱుచుగ్రంథప్రమాణములను వసుచరిత్రమునుండియే సంపాదించెను. దీనింగూర్చి వ్రాయుటకుఁ బూర్వము సంగీతవిద్యాసాధనాగ్రేసర మగువీణావిషయక మైనకొన్ని సంప్రదాయములు సంగ్రహముగా వక్కాణింప వలసియున్నది. అందులో నాకు విశేషపరిచయము లేకుండుటం జేసి ఆవిద్యాపారంగతులయభిప్రాయము కొంత కొంతయారసిదానినిటవక్కాణించెదను. ఎట్లనఁగా -

వీణియలసంప్రదాయము.

దీనిం దెల్పుగ్రంథములు కొన్ని కలవు. అవి సామాన్యముగ వీణావిద్యాసంప్రదాయమును స్పష్టీకరించును. అందు వీణియలు నాల్గు భేదములు గల వని యీక్రిందిశ్లోకమువలనఁ జెప్పఁబడును.

శ్లో. నారదస్యాపి మహతీ తుమ్బురోస్తు కళావతీ,
    విశ్వావసోస్తు బృహతీ సరస్వత్యాస్తు కచ్ఛఫీ.

అని దీనింబట్టి సంగీతవిద్యాసాధనములు వీణియలనునామముతోనే యొప్పుననియును అవి నాల్గుభేదములు గల వనియు వానిని మొదట కల్పించినవారు నల్గు రనియుఁ దేలినది. వానిభేదములును ఒక్కొక్కదానివిశేషములు నీక్రిందిపట్టికలోఁ గనబఱిచెదను.