పుట:Kavijeevithamulu.pdf/331

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
325
పింగళిసూరన.

షష్ఠ్యంతములలోఁగూడ విరూపాక్షేశ్వరునిపేరే యున్నది. అటుపిమ్మట విరూపాక్షేశ్వరునకు సభక్తికసమర్పితంబుగా నాయొనర్పంబూనిన రాఘవపాండవీయమునకుఁ గథాక్రమం బెట్లనిన యనియున్నది. ప్రతియాశ్వాసాద్యంతముల యందును విరూపాక్షదేవునిపేరే యున్నది. గ్రంథసమాప్తినిఁగూడ నీక్రిందివిధంబున విరూపాక్షదేవునిపేరే చేర్పఁబడియున్నది.

శా. దేవా దేవరప్రేరణంబునన యుద్దీపించువాగ్వైభవ
     శ్రీవిస్ఫూర్తిని రామభారత కథాశేషప్రబంధోత్తమ
     వ్యావిర్భావము నిట్లు సెందె నిది భవ్యాభవ్యత ల్సూడ కిం
     పై వర్తిల్లఁ బరిగ్రహింపుము విరూపాక్షా జగద్రక్షకా.

శా. క్రీడామాత్రకృతత్రిమూర్తిభరణాంగీకారచూడాపరి
    భ్రాడాదిత్యధునీపృషత్పుషితపంపాశైత్యవేధోమరు
    ద్రాడారాధితపాద యంఘ్రినఖచంద్రద్యోత సిధ్యత్పరి
    వ్రాడాఖండలమండలీహృదయజీవంజీవసంజీవనా.

వ్యాఖ్యాతం గూర్చి.

ఈ రాఘవపాండవీయమునకు ముద్దరాజుపెదరామమంత్రి వ్యాఖ్యానముం జేసెను. ఇతనికాలముగాని యునికిపట్టుగాని తెలియుట కా గ్రంథములో నేమియును వ్రాయంబడలేదు. వ్రాతఁప్రతులలోఁ గొంత యున్నట్లుగాఁ తెలియవచ్చినది. అవి ప్రస్తుతము దొరకుట యరుదుగా నున్నది. అతఁడు ఆశ్వాసాంతములయందు వ్రాసియుండు గద్యలంబట్టి ముద్దరాజు గణపమంత్రికుమారుఁ డని మాత్రము తేలుచున్నది. ఇదియునుగాక నందవరీకశాఖానియోగులనియును స్పష్ట మగు.

ఆగద్య మెట్లన్నను :-

"ఇది శ్రీమదనగోపాల కృపాకటాక్ష సంప్రాప్త సారసారస్వత సంపదానంద నందవరకుల క్షీరపారావార రాకాసుధాధామ ముద్దరాజు గణపయామాత్య పెద్దరామ ధీమణి ప్రదర్శితం బైనరాఘవపాండవీయాదర్శంబు"