పుట:Kavijeevithamulu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

కవి జీవితములు

అని యున్నది. కాలము లోనగునవి యచ్చొత్తువారికిని లభ్యములు కాకయుండవచ్చును. ఇఁక రాఘవపాండవీయ శయ్యాదికముం గూర్చి యిప్పుడు వ్రాసెదను :-

రాఘవపాండవీయశయ్యాదికము.

దీనియుత్పత్తింగూర్చి యిదివఱకే కొంత కొంత వ్రాసియున్నాము. ఇపు డిందలి కవి కవిత్వవిశేషములు నుడువుట మాత్రము కావలసినదిగా నున్నది.

రాఘవపాండవీయములోని పదప్రయోగాది విషయము.

దీనివిషయమై దక్షిణామూర్తి పండితునివలన వ్రాయంబడినది మిక్కిలి పరిశీలనము చేయంబడినయభిప్రాయము కాదు. అట్టి పరిశీలన మంతయు సరియైనట్టుగా నే నొప్పుకొనఁజాలను. శ్లేషకావ్య మౌటం జేసి యీగ్రంథములో సూరకవిచేయవలసి చేసినకొన్ని ప్రయోగములు లాక్షణికులందఱికి సమ్మతములు కావయ్యెను. వైయాకరణులలోఁగూడ నహోబలపతి మొదలగువారలు కొన్ని యాక్షేపణలు చెప్పిరి. ద్వివిధ రేఫలవిషయమై పెనఁగులాడువారు గూడ నీసూరకవి చేయుఱకార ప్రయోగములలోఁ గొన్నిటికి సమ్మతింపరైరి. వాని నన్నిఁటి నిట వివరించుట మిక్కిలి కష్టసాథ్యమును స్వల్పలాభయుతము నై యుండుంగావున ఆ పని మాని వానింగూర్చి అప్పకవీయములో నహోబలపండితీయములోఁ జూడం దగు నని వక్కాణించెదను. శ్లేషకావ్యములలో నర్ధాను స్వారములును, శకటరేఫములును, అఖండయతులును బ్రబంధములలోవలెఁ కల్గుట తటస్థించదు. సంస్కృతశబ్దములు తెలుగులో శ్లేషించి విడఁదీయునపు డిట్టినియామకములు కొన్ని పొసఁగియుండవు. అట్టిపట్ల సూరనకేకాక యితరకవుల కెంతవారికి నైన మార్చి చెప్పుట దుష్కరము కావున పైదోషము లున్నంతమాత్రమున శ్లేష కావ్యమున కొక లోప మాపాదింపఁగూడదు. ఎ ట్లైనను సూరనప్రయోగములు విజాతీ