పుట:Kavijeevithamulu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

కవి జీవితములు

శ్లేషోదాహరణము :-

సీ. క్రీడానరుం డైనశ్రీవరుం డిట్లు క్షా, త్త్రప్రక్రియను విజయప్రసక్తి
    నిర్వహించుచు శత్రునిర్మూలనము సల్పి సొంపుమైఁ దనకును శుభసదనిక
    లంకాధిరాజ్యవిలాసపట్టాభిషే, కము స్వపురస్ఫూర్జితముగ నడప
    వసుధ నప్పుడు దానవప్రభుత్వవిశేష, పృథుతరదీప్తివిభీషణుండు

తే. తేజరిల్లె ధర్మరాజితరక్షమా, పాలదుర్లభతరభాగ్యలక్ష్మి
    నేఁడు గా ఫలించె నెఱయ నస్మత్పూర్వ, సుకృత మద్భుత మని సుజను లలర.
                                                                            ఆశ్వా. 4. ప. 209.

రాఘవపాండవీయకృతివిషయము.

ఈగ్రంథమును సూరనకవి తనయితరగ్రంథములవలెఁ గాని లేక యితరకవుల గ్రంథములవలెఁగాని చెప్పక గ్రంథమున కిర్వురుకృతిపతులఁ జేసె. అందు పెదవేంకటాద్రి యొకకృతిపతిగాను, విరూపాక్షక్షేత్రాధిపతి యగువిరూపాక్షేశ్వరుఁ డనుశివుఁ డొకకృతిపతిగా నున్నట్లు కానుపించును. దానికిఁ గారణము తానావఱకే గ్రంథ మారంభించి విరూపాక్షస్వామికిఁ గృతి నీయవలయు ననుకోర్కె కలవాఁడై యుండి అనంతరము రాజసన్మానార్థమై తన తొల్లింటియభిప్రాయము మానియుఁ గేవల మట్లు మానుటవలన స్వప్రతిజ్ఞాభంగ మగు నని యూహించి, తదర్థమై రెండుపేరులును గల్పి యుండు నని తోఁచుచున్నది. లేదా మఱియొకకారణ మేదియైన నుండవచ్చును. దీనింగూర్చి రాఘవపాండవీయములో నీక్రిందివిధంబుగ వ్రాయఁబడినది. అది చూచినవారల కది నిశ్చయమే అని తోఁచక పోవునేమో యని యూహించి పై కారణ మూహించుట యయినది, ఆవచన మెట్లన్నను :-

"వ. అని యిట్లు కృతోత్సాహుండ నగుచు నేతత్ప్రబంధనారంభంబునకుఁ బ్రేరకుం డైనసకలాంతర్యామి హేమకూటాధ్యక్షుఁడు శ్రీనిరూపాక్షుండు నిర్విఘ్న పరిసమాప్తి ప్రచయగమనంబులకుం దాన కలండు. అతని సంకల్పానుసారంబున నెట్లు కావలయు న ట్లగుంగాక నాకు భారం బేమి యనుతలంపున నిశ్చితుండ నై కడంగి దీనికిఁ బ్రత్యక్షనియామకుం డైనపెదవేంకటాద్రి మహీవల్లభు వంశక్రమం బభివర్ణించెద. ఆశ్వా 1 - ప 20.