పుట:Kavijeevithamulu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

323

నయంశము లవుటంబట్టియు వాని నిట వివరించుట మాని సూరకవి పదశయ్యాదులలో నెఱ్ఱప్రగ్గడం బోలినవాఁడనియును, అతనివలె నీ సూర కవియును, దీర్ఘ సమాసములును. సంస్కృతములోఁగూడ నసాధారణములుగాఁ బ్రయోగింపఁబడువై యాకరణుల ప్రయోగము లీయాంధ్రములోఁ బ్రయోగించునిష్టము కలవాఁ డనియుం జెప్పెఁదగియున్నది. శ్లేష లేక యున్న పద్యములలో నిట్టిచమత్కృతులు విశేషించి కానుపించును. శ్లేషలోఁగూడ ప్రౌఢప్రయోగములఁ జేయును. దీనిం జూపుటకుఁ గొన్ని పద్యముల నీక్రింద వివరించెదను.

శా. శ్రీచన్గొండలు రెండు నండగొని వాసిం బేర్చుచు న్భక్తిసా
     మీచీన్యామలపెద్దవేంకటనృపోన్మీలన్మనశ్చాతక
     వ్యాచిక్రింసకుఁ గైవసం బయి సదోదంచత్కృపాదృష్టి స
     ధ్రీచీనం బగుకృష్ణమేఘము జగత్ప్రీతిం గడుం జేయుతన్.

శా. లోకత్రాణరతిం దదాదిమమహీలోకప్రబంధోత్కభా
     షా--- ప్తప్రథమ ద్వితీయ పదగుంజన్మంజుమంజీరగ
     ర్జాకల్పామలరామభారత కథాసర్గఁబుల న్మించువా
     ల్మీకివ్యాసుల గొల్చెదన్ దదుభయశ్లేషార్థసంసిద్ధికిన్.

      దీర్ఘసంస్కృత సమాసమునకు :-

ఉ. అంత వసంత మొప్పెఁ జరమాగ్రిమభాగచరాఖిలర్తుసా
    మంత మనంతజాలకసమంజసరంజితకుంజకుంజరో
    ధ్వాంతనితాంతసాంద్రమధుదానవిజృంభితబంభరస్వనా
   త్యంతనిరంతరీకృతదిగఁత మతాంతలతాంతకుంత మై.

మిశ్రకవిత్వమున కుదాహరణము.

సీ. అచ్చంపులేఁజిగురాకుజొంపము కెంపు, మేలిచెందిరపుఁగెంధూళి గాఁగ
    గ్రుచ్చినట్టుగ జాదుకొన్న మొగ్గలగుంపు, ప్రకటపాటలబిందుపాళి గాఁగ
    విచ్చినపరువంపువిరులతండము పెంపు, శోభితతభూతిరింఛోళి గాఁగ
    నిచ్చలం బైనతేనియవానజడి సొంపు, లాలితదానధారాళిగాఁగ

తే. సుమపరాగము ల్కేళిపాంసువులు గాఁగ, భ్రమరపంక్తులు పైసరపణులు గాగ
    బుడమి నెల్లను వాహ్యాళి వెడలుమదను, మదపు టేనుఁగుబోలె నామనిఁ దనర్చి.